Healthy Food Recipe for Girls : మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకు కొన్ని ఫుడ్స్ కచ్చితంగా పెడతారు. అలాంటివాటిలో నువ్వుల లడ్డూలు(Sesame Laddu) కూడా ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాల్లో చిమ్నీలు కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కేవలం అమ్మాయిలకే కాదు.. నడుమునొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఇవ్వొచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


నువ్వులు - 100 గ్రాములు


కొబ్బరి - 50 గ్రాములు


బెల్లం - 150 గ్రాములు 


యాలకులు - రెండు 


తయారీ విధానం


ముందుగా సగం కొబ్బరి కాయను 5 రోజులు ఫ్రిజ్​లో ఉంచండి. ఇలా చేయడం వల్ల అది కాస్త డ్రై అవుతుంది. కొబ్బరి పొడి ఫ్రెష్​గా కావాలనుకుంటే ఇలాచేయవచ్చు. లేదంటే కొబ్బరి పొడి కొని తెచ్చుకోవచ్చు. నువ్వులను రెండు రోజుల ముందు నుంచి ఎండలో ఉంచండి. లడ్డూలు చేసే రోజు.. స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టి నువ్వులను వేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగినా రుచి మారుతుంది. నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి స్టౌవ్ దగ్గరే ఉండి వేయించుకోవాలి. నువ్వులు కరకరలాడుతూ ఉంటే చాలు. ఇప్పుడు వాటిని కాస్త చల్లార్చేందుకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బెల్లాన్ని మెత్తగా తరిగి పక్కన పెట్టుకోవాలి.  


పూర్తిగా కరిగిన తర్వాత


ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని.. దానిలో ఒకవంతు నువ్వులు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. కొబ్బరిని కూడా ముక్కలు చేసి.. మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిలో బెల్లం వేసి కరగనివ్వండి. అడుగు పట్టకుండా చెంచాతో దానిని కదిలిస్తూ.. బెల్లం కరిగే వరకు ఉంచాలి. బెల్లంతో పాటు ఓ స్పూన్ నీటిని కూడా వేయొచ్చు. అది కరిగిన తర్వాత దానిలో యాలకుల పొడి, తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. అవి కాస్త ఉడికాయి అనుకునప్పుడు స్టౌవ్ ఆపేసి పాన్ దించేయండి. 


గోరువెచ్చగా ఉన్నప్పుడే..


ఇలా దించేసిన బెల్లం మిశ్రమంలో నువ్వుల పొడి, నువ్వులు వేసి బాగా కలపాలి. అన్ని బాగా కలిసే వరకు చెంచాతో కలుపుతూనే ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే నువ్వులు వేస్తే పిండి బాగా కలుస్తుంది. కాస్త గోరువెచ్చగా మారుతున్నప్పుడు చేతితో కలిపి.. దానిని లడ్డూలుగా చేసుకోవాలి. అంతే టేస్టీ, హెల్తీ లడ్డూలు రెడీ. తయారు చేసేప్పుడు చేతులకు కాస్త నెయ్యిని కూడా రాసుకోవచ్చు. వీటిని పెద్దవారి నుంచి.. పిల్లలవరకు అందరూ తినొచ్చు. ముఖ్యంగా వయసుకొచ్చిన అమ్మాయిలకు వీటిని పెడితే ఆరోగ్యానికి చాలామంచిదని చెప్తున్నారు. 


ఈ టిప్స్ ఫాలో అవ్వాలి..


నువ్వులు తాజాగా ఉండేవి ఎంచుకోవాలి. బెల్లం కూడా ముదురు రంగులో తియ్యగా ఉండేదానిని ఎంచుకోవాలి. ఈ రెండింటిలో ఏది బాగోకపోయినా రుచి మారుతుంది కాబట్టి.. ముందే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని అమ్మాయిలకు రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున ఇస్తే ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే వెన్నెముక సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తాయి. 


Also Read : మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. వెంటనే నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి