Waking up in the Middle of the Night : కొందరికి నిద్ర లేట్​గా వస్తుంది. మరికొందరు తొందరగానే నిద్రపోయినా.. మధ్యలో మెలకువ వస్తుంది. వారిలో కొందరు మళ్లీ నిద్రపోగలుగుతారు.. మరికొందరు నిద్రపోలేరు. ఇలా మధ్య నిద్రలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర రాకపోతే.. అంసపూర్ణ నిద్ర అంటారు. దీనివల్ల ఆరోగ్యంపై, రోజూవారి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. మళ్లీ వెంటనే నిద్రపోవడానికి కొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. అవి ఫాలో అయితే వెంటనే నిద్రపడుతుందని చెప్తున్నారు. 


మధ్యరాత్రిలో మెలకువకు కారణాలేంటి..


ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, నిద్ర సమస్య ఉన్నప్పుడు మధ్యరాత్రిలో మెలకువ వస్తుంది. ఇవే కాకుండా పీడకలలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఇతరత్రా సౌండ్స్ వల్ల కూడా మధ్యరాత్రిలో నిద్ర లేస్తారు. పడుకునే ముందు నీరు తాగడం వల్ల వాష్​ రూమ్​కి వెళ్లడం, దాహం వేయడం వంటివి కూడా ఈ మెలకువకు కారణమవుతున్నాయి. కారణం ఏది అయినా దానికి చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. 


ఒత్తిడిని తగ్గించుకోవాలి


స్ట్రెస్ అనేది తెలిసి ఒకలాగ.. తెలియక మరోలా ఇబ్బంది పెడుతుంది. కొందరికి ముందుగానే నిద్రను దూరం చేస్తే.. మరికొందరికి మధ్యరాత్రిలో నిద్రను దూరం చేస్తుంది. అందుకే ప్రశాంతమైన నిద్ర కావాలనుకునేవారు ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని యోగా టెక్నిక్స్, ఆసనాలు వేస్తూ ఉంటే.. స్ట్రెస్ తగ్గుతుంది. 


టైమ్ చెక్ చేయకండి.. 


మధ్యరాత్రిలో నిద్రలేచి టైమ్ చూస్తే.. నిద్ర దూరమవుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సమయం కూడా ఒత్తిడిని పెంచుతుందట. అంతేకాకుండా టైమ్ అయిపోతుంది పడుకోవాలనే ఓవర్ బర్డెన్​లో నిద్ర త్వరగా రాదు. కాబట్టి మీరు మధ్యలో నిద్ర లేచినా.. వీలైనంత త్వరగా పడుకోవాలి అంటే టైమ్​ని చూడకపోవడమే మంచిది. 


బెడ్​ రూమ్​ టిప్స్


మీ బెడ్​ రూమ్​లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయని వాతావరణం ఉంటే మీరు ఎక్కువసేపు నిద్రపోగలుగుతారు. కాబట్టి మీ రూమ్​ చీకటిగా.. నిశబ్ధంగా.. మీకు సరిపడా టెంపరేచర్​లో ఉండేలా చూసుకోండి. పరుపు కూడా నిద్రలో మేజర్​ రోల్ పోషిస్తుంది. కాబట్టి పరుపు దిండు విషయంలో కాంప్రమైజ్ కాకండి. 


మొబైల్ చూడకండి..


కొందరు నిద్ర రాకపోయినా.. నిద్రలో మెలకువ వచ్చినా.. వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నిద్ర మీకు మరింత దూరమవుతుంది. పైగా మొబైల్ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. టీవీలు కూడా చూడకపోవడమే మంచిది. 



ఇతరత్రా కారణాలు ఇవే


ఇవే కాకుండా కెఫెన్ తాగడం, పడుకునే ముందు మంచినీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయకూడదు. అలాగే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. పీడకల వచ్చినప్పుడు నిద్రపోవాలి అనుకుంటే బ్రీత్ ఎక్సర్​సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొందరు బెడ్​రూమ్​లో బెడ్ ల్యాంప్ ఉంటేనే నిద్రపోతారు. మరికొందరికి బెడ్ ల్యాంప్ లేకపోవడమే మంచిది. ఇది కచ్చితంగా నిద్రపై ప్రభావం చూపిస్తుందని మరచిపోకండి. సమస్య ఎక్కువైతే వైద్యులను సంప్రదించడం మరచిపోవద్దు.


Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి