హీరో నాగశౌర్య షూటింగ్ సెట్లో కళ్లు తిరిగి పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అతను ఎందుకు పడిపోయాడో చాలా మందికి తెలియదు. అతను తీవ్ర జ్వరం, తీవ్రమైన డీ హైడేషన్‌తో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అయితే ఆసియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి వైద్యులు చెప్పిన ప్రకారం బరువు తగ్గడానికి ఆయన తన డైట్ నుంచి నీళ్లు తగ్గించుకున్నారు. అదే ‘నాన్ లిక్విడ్ డైట్’. దీని వల్లే ఆయన శరీరం బాగా డీహైడ్రేట్ అయిపోయి, స్పృహ తప్పి పడిపోయినట్టు తెలిసింది. ముఖ్యంగా రెండు రోజుల పాటూ ఆయన నీళ్లు తాగడం చాలా వరకు తగ్గించేశారని అందుకే శరీరం తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడిందని సమాచారం. ఇలా శరీరంలో నీరు తగ్గడం వల్ల ఏమవుతుంది? నీరు మనకెందుకు అవసరం? 


శరీరానికి నీరు ఎందుకు?
శరీరంలో నీరు చాలా ముఖ్యం. శరీరంలోని కణజాలాలను కాపాడడంలో,కీళ్లలోని ద్రవపదార్థాలు రక్షించడంలో నీటి పాత్ర ప్రధానమైనది. నీరు తగ్గితే ఎన్నో మానసిక, శారీరక రోగాలు దాడి చేస్తాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీటిని తాగాలి.  నీరు తగ్గితే ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది, మూడీగా ఉంటారు, శరీరం వేడెక్కిపోతుంది, మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. హార్మోన్లు, న్యూరోట్రాన్స్మిటర్లను సృష్టించడానికి,  మెదడుకు అవసరమైన రసాయనాలను సమతుల్యం చేయడానికి నీరు అవసరం. శరీరం అంతటా ఆక్సిజన్ రవాణా కావడానికి, ఎముకలను పరిపుష్టంగా మార్చడానికి నీరు కావాలి. 


డీహైడ్రేషన్ అంటే ఏమిటి?
శరీర అవసరాలకు సరిపడా నీరు తాగనప్పుడు డైహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. దీని లక్షణాలు వెంటనే కనిపిస్తాయి. 
1. దాహం పెరిగిపోతుంది. 
2.నోరు పొడిబారిపోతుంది. 
3. తీవ్ర అలసట వస్తుంది. 
4. మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. 
5. ముదురు రంగు మూత్రం
6. చర్మం పొడిబారి పోతుంది.
7. కండరాలు తిమ్మిరి పడతాయి. 


తీవ్రమైన డీహైడ్రేషన్ అయితే...
నీరు తాగడం బాగా తగ్గిస్తే తీవ్రమైన డీహైడ్రేషన్ బారిన పడతారు. అప్పుడు అవయవాలు తమ పని తాము చేయలేవు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమటలు పట్టి జ్వరం వచ్చేస్తుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్చి సెలైన్ పెట్టించుకోవాలి. లేకుంటే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. 


Also read: సైనసైటిస్ రావడానికి ఎన్నో కారణాలు, అందులో ధూమపానం కూడా ఒకటి - చికిత్స ఇలా






















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.