తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ జీవితం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సినిమా ఉన్నంత వరకూ ఆయన జ్ఞాపకాలు పదిలం. సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ మరణవార్తతో అటు ఆయన కుటుంబంలో, ఇటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం కృష్ణ గురించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన లీడ్ రోల్ లో నటించిన మొదటి సినిమా 'తేనె మనసులు' ప్రి రిలీజ్ ఫంక్షన్ కు తనని తాను పరిచయం చేసుకుంటూ ఓ లేఖ రాశారు. ఆయన స్వయంగా రాసిన ఆ లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది.
కృష్ణ రాసిన ఆ లేఖలో ఇలా ఉంది. “రసిక ప్రపంచానికి నా వందనాలు నాపేరు కృష్ణ. 'తేనె మనసులు' చిత్రంలో పేరు బసవరాజు. సినిమాలో నటించాలన్న ఆశతో ఎన్నాళ్ల నుంచో లెఫ్ట్ రైట్ కొడుతూ కలగంటున్న నాకు ఇన్నాళ్లకు అది రంగురంగుల కలగా ఈస్ట్మన్ కలర్లో నిజమైంది. కాని దానికోసం దర్శకులు, డాన్సు డైరెక్టర్ నాచేత మూడు మాసాలబాటు అక్షరాలా డ్రిల్లు చేయించారు. తరవాత నటన నేర్పారు. డాన్సు నేరారు. చివరికి నావేషం ఏమిటండీ అంటే.. డ్రిల్లు మేష్టరేనన్నారు. నటన మాత్రం డ్రిల్లు లాగే రాకుండా జాగ్రత్తగా, శ్రద్ధగా చేశాననుకోండి. మీరందరూ చూసి బాగోగులు చెప్పే క్షణం కోసం ఆశతో ఆరాటంతో ఎదురు చూస్తున్నాను. ఉగాదికి నా శుభాకాంక్షలు - కృష్ణ, 27.03.65” అని ఉంది.
ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘తేనెమనసులు’ సినిమా 1965 మార్చి 31న రిలీజ్ అయింది. దానికి ముందు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కృష్ణ తనను తాను ఇలా సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచనలతో కృష్ణ అందరి దృష్టినీ ఆకర్షించే వారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతోంది.
ఇలా 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఈ చిత్రం తర్వాత వచ్చిన 'గూఢచారి 116' సినిమా కృష్ణ కెరీర్ నే మార్చేసింది. ఆయన హీరో గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ సినిమాలు ఎంతో ఉపకరించాయి. దీంతో ఆయన ఒకేసారి 20 సినిమాల్లో నటించడానికి సంతకాలు చేశారు. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు విడుదల చేసేవారంటే సినిమా పట్ల ఆయనకు ఉన్న ఆసక్తి ఏంటో అర్ధమవుతుంది. కృష్ణ నటించిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు, గూడుపుఠాని, పండంటి కాపురం, అవే కళ్లు, మండే గుండెలు, ఏజెంట్ గోపి, దేవదాస్, అంతం కాదిది ఆరంభం, అగ్నిపర్వతం, పచ్చని సంసారం, ఈనాడు, తెలుగువీర లేవరా, ప్రజారాజ్యం, మోసగాళ్లకు మోసగాడు, గంగ మంగ, అమ్మకోసం, భలే దొంగలు, మీనా, రామ్ రాబర్ట్ రహీమ్ మంచివాళ్లకు మంచివాడు, పాడిపంటలు, అన్నదమ్ముల సవాల్, మాయదారి మల్లిగాడు, దేవుడు చేసిన మనుషులు తదితర సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో పాతుకుపోయాయి. అందుకే సూపర్ స్టార్ అనే బిరుదును కృష్ణ కు కట్టబెట్టారు అభిమానులు. అప్పట్లోనే కౌ బాయ్, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలను పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేశారు కృష్ణ. ఆయన చేసే ప్రతీ ప్రయోగం ఇండస్ట్రీకు ఎంతో ఉపయోగపడింది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ సాంకేతికంగా అభివృద్ధి చెందటానికి కృష్ణ ప్రముఖ పాత్ర పోషించారు. అలాంటి గొప్ప నటుడ్ని కోల్పోవడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.