Dondakaya Pachadi in Andhra Style : దొండకాయలను కొందరు ఫ్రైగా, కర్రీగా చేసుకుని తింటారు. మరికొందరు అస్సలు దొండకాయ తినరు. అయితే ఎవరైనా దొండకాయలను ఇష్టంగా తినగలిగే రెసిపీ ఇక్కడుంది. అదే దొండకాయ పచ్చడి. దీనిని రైస్, రోటీ, టిఫిన్లలో కలిపి తినేయొచ్చు. మంచి రుచిని అందించడమే కాకుండా హెల్త్​కి కూడా మేలు చేస్తుంది. అయితే ఈ టేస్టీ దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


నూనె - 6 టేబుల్ స్పూన్స్


వేరుశనగలు - 2 టేబుల్ స్పూన్స్


ధనియాలు - 1 టేబుల్ స్పూన్


జీలకర్ర - 1 టీస్పూన్


టమోటాలు - 2


పచ్చిమిర్చి - 12


చింతపండు - నిమ్మకాయంత


ఉప్పు - రుచికి తగినంత 


దొండకాయ - అరకిలో 


కొత్తిమీర - చిన్న కట్ట 


ఆవాలు - అర టీస్పూన్ 


జీలకర్ర - అర టీస్పూన్ 


ఎండుమిర్చి - 2


శనగపప్పు -  1 టీస్పూన్


కరివేపాకు - 3 రెమ్మ


వెల్లుల్లి - 8


పసుపు - చిటికెడు


తయారీ విధానం 


ముందుగా దొండకాయలను బాగా కడిగి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. అది వేడి అయిన తర్వాత దానిలో పల్లీలు వేసి.. వేయించుకోవాలి. అనంతరం ధనియాలు, జీలకర్ర వేసి కలిపి వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టి అదే కడాయిలో టమోటాలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి మగ్గనివ్వాలి. 


టమోట తొక్క విడిపోయి.. గరిటతో నొక్కితే మెత్తగా అయితే టమోటాలు రెడీ అయినట్టే. వీటిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేయాలి. బాగా కలిపాలి. స్టౌవ్ ఆపేసి.. మిక్సీ జార్​ తీసుకుని దానిలో పల్లీలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసుకోవాలి. అది మంచిగా గ్రైండ్ అయిన తర్వాత టమోట, పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉప్పు వేసి.. వీటిని కూడా పల్లీ పౌడర్​ మిక్స్​తో కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని పక్కన పెట్టుకుని స్టౌవ్ వెలిగించాలి. దానిపై కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడి అయినా తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేయాలి. 


దొండకాయలు మగ్గి.. కాస్త రోస్ట్ అవ్వాలి. దొండకాయ మాడిపోకుండా రోస్ట్ అయితే పచ్చడి రుచి చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి దొండకాయలు ఫ్రై చేసుకునేప్పుడు కాస్త అటెంటివ్​గా ఉండాలి. దొండకాయ వేగిన తర్వాత దానిని కూడా మిక్సీజార్​లోకి తీసుకోవాలి. దానిలో పచ్చికొత్తమీరను వేసుకోవాలి. వీటన్నింటిని కలిపి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. అయితే దొండకాయ పూర్తిగా కాకుండా కాస్త కచ్చాపచ్చగానే ఉండేలా చూసుకోవాలి. తినేప్పుడు దొండకాయ తగులుతూ ఉంటే పచ్చడి రుచి మరింత పెరుగుతుంది. 



ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి అది వేడి అయ్యాక దానిలో ఆవాలు వేయాలి. అనంతరం జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. దానిలో శనగపప్పు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అనంతరం కరివేపాకు వేయాలి. వెల్లుల్లిని కాస్త కచ్చాపచ్చాగా దంచి.. తాళింపులో వేసి వేయించాలి. చివరిగా పసుపు వేసి ఫ్రై చేసుకుని.. ముందుగా చేసుకున్న పచ్చడిని దీనిలో వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని.. తింటే టేస్ట్ మరింత క్రేజీగా ఉంటుంది. 


Also Read : షుగర్ ఉన్నవాళ్లు బెండకాయలు అలా తీసుకుంటే చాలా మంచిదట.. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా