పిల్లలు ఏం చేస్తున్నారో, ఏం తింటున్నారో, ఎలాంటి వారితో ఉంటున్నారో, చివరికి ఎలాంటి ఆటలు ఆడుతున్నారో కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు టీనేజీలో ఉన్న పిల్లలు ఉంటే, వారికి వీడియోగేమ్స్ ఆడే అలవాటు ఉంటే... వారితో కాసేపు వాటి గురించి మాట్లాడండి. వారు పబ్ జీ గేమ్ లో శత్రువులను ఎలా చంపాలో, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ లో విరోధులను తుపాకితో ఎలా కాల్చాలో, ఫోర్ట్ నైట్ గేమ్ ఎలా ఆడాలో చర్చించడం మొదలుపెడతారు. వీడియోగేమ్స్ ఆడే పిల్లల బుర్రలు పూర్తిగా వాటికి బానిసలుగా మారిపోతున్నాయి. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు... ఓ అంతర్జాతీయ అధ్యయనం చెబుతోంది. టీనేజీ పిల్లల్లో కొన్ని రకాల వీడియో గేమ్స్ హింసాత్మక భావాలను, కోపాన్ని, కసిని పెంచేస్తున్నాయని, వారి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని తేల్చి చెప్పింది ఓ అధ్యయనం. అంతేకాదు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండమని తల్లిదండ్రులకు సూచిస్తోంది. ఇంకా సూటిగా చెప్పాలంటే ఇంట్లో హింసాత్మక వీడియగేమ్స్, ప్లే స్టేషన్లను తీసి బయటపడేసి, పిల్లలను కాపాడుకోమని చెబుతోంది. వారి మనసుల్లో ప్రేమ, దయ నిండి ఉండాలి కానీ, ఒకరిని కాల్చి చంపాలి వంటి ఆలోచనలు రాకూడదు. వీడియో గేమ్స్ అలాంటి హింసాత్మక ఆలోచనలను పెంచేస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త...
ఇప్పటికే మీ పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి అలవాటు పడితే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూడండి.
1. ఇతర అలవాట్లు, శారీరక ఆటల్లో ఆసక్తి చూపించకపోవడం
2. నిద్ర పోకపోవడం
3. చదువుపై ఆసక్తి చూపించకపోవడం
4. నలుగురిలో కలవకపోవడం
5. బరువు పెరగడం
6. మూడ్ స్వింగ్‌లు అధికంగా ఉండడం
7. చిన్న విషయానికే కోపం తెచ్చుకోవడం
8. తరచూ విసుక్కోవడం
9. ఇతరులను తిట్టడం
10. ఇతరుల పట్ల గౌరవం, ఆసక్తి చూపించకపోవడం
పైన చెప్పిన లక్షణాలు మీ అబ్బాయిలో కనిపిస్తే కచ్చితంగా మీరు ఓసారి అతను ఏం ఆడుతున్నాడో,అధికంగా ఇంట్లో ఏ పనిలో ఉన్నాడో గమనించాలి. వీడియో గేమ్స్ ఆడుతున్నట్టు అయితే... ఎలాంటి గేమ్స్ ఆడుతున్నాడో కూడా చూడాలి. టీనేజీ పిల్లలు అడుగు బయటపెట్టకుండా ఇంట్లోనే ఉంటున్నారంటే వారు ఏం చేస్తున్నారో కూడా గమనించుకోవాలి.
ఆలస్యం చేయద్దు...
మీ పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. అతను ఎలాంటి హింసాత్మక వీడియో గేమ్స్ ఆడతాడో వివరించాలి. మానసిక వైద్యులు మీ పిల్లాడికి చికిత్స అందిస్తారు.
మీరు చేయాల్సిందిదే...
ముందు పిల్లల మీద అతి ప్రేమతో ప్లే స్టేషన్లు, వీడియో గేమ్స్ కొనివ్వడం మానేయండి. వారు తుపాకులతో కాల్చి చంపడం వంటి గేమ్స్ ఆడితే మొదట్లోనే అడ్డుకోండి. వీలైతే వారిని పూర్తి వీడియోగేమ్స్ కు దూరంగా ఉంచండి.పిల్లలకు సెపరేట్ రూమ్ ఇచ్చినవారు అందులో బెడ్, పుస్తకాలు తప్ప మరే ఇతర సౌకర్యాలు కల్పించకండి. కొంతమంది ఆ రూమ్ లోనే టీవీలు, ప్లేస్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తును, మానసిక ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నవారవుతారు.
Also read: ఈ నాలుగు పానీయాలు మీ తలనొప్పిని తీవ్రంగా మారుస్తాయి, తాగకపోవడం మంచిది
Also read: పక్కవారు వదిలిన సిగరెట్ పొగ పీలుస్తున్నారా? అయితే ఈ సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే