షిఫ్ట్ పూర్తయిన తర్వాత పనిచేయడం చాలామందికి ఇష్టం ఉండదు. డ్యూటీ పూర్తికాగానే ఇంటికి వెళ్లి రిలాక్స్ కావాలని అనుకుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే షిఫ్టులను పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోతారు. కానీ, విమానం, రైలు, బస్సు వంటి రవాణా వ్యవస్థల్లో పనిచేసేవారికి ఈ షిఫ్టులు వర్తిస్తాయా? ఒక వేళ వారు నడిపే వాహనాలు వాతావరణం అనుకూలించకో.. సాంకేతిక కారణాలు, ట్రాఫిక్ సమస్యల వల్ల సమయానికి గమ్యానికి చేరుకోకపోతే ఏం చేస్తారు? ప్రయాణికులను మధ్యలో వదిలి వెళ్లిపోలేరు కదా. అలాంటి సమయంలో షిఫ్ట్ గురించి ఆలోచించకుండా పనిచేయాల్సి వస్తుంది. అయితే, పాకిస్థాన్‌లోని ఓ పైలట్ మాత్రం అలా చేయలేదు. తన షిఫ్ట్ అయిపోయిందని, ఇక నడపనంటూ మొండికేశాడు. మధ్యదారిలో ప్రయాణికులను ముప్పుతిప్పలు పెట్టాడు.
అసలు ఏం జరిగింది?: పాకిస్థాన్‌కు చెందిన PK-9754 విమానం సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ఇస్లామాబాద్‌కు బయల్దేరింది. అయితే, వాతావరణం బాగోలేకపోవడం వల్ల విమానాన్ని అత్యవసరంగా సౌదీ అరేబియాలోని దమ్మమ్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. కొన్ని గంటల తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానాన్ని ఇస్లామాబాద్‌కు తీసుకెళ్లడానికి అనుమతి లభించింది. అయితే, పైలట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించాడు. తన షిఫ్ట్ అయిపోయిందని, విమానం నడపడం కుదరదని చెప్పేశాడు. దీంతో ప్రయాణికులు షాకయ్యారు. ఇప్పుడు తాము ఇస్లామాబాద్‌కు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. విమానం దిగేందుకు నిరాకరించారు.
ఈ సమాచారం అందుకున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పైలట్‌ను సంప్రదించారు. విమానాశ్రయంలోని PIA అధికారులు వెంటనే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్ సమీపంలోని హోటళ్లలో వసతి కల్పించారు. జర్నీ సేఫ్‌గా సాగాలంటే పైలట్‌కు విశ్రాంతి అవసరమని, ప్రయాణికులు సహకరించాలని కోరారు. విశ్రాంతి తర్వాత పైలట్ విమానాన్ని నడిపేందుకు అగీకరించాడు. ఎట్టకేలకు అదే రోజు సాయంత్రం రాత్రి 11 గంటలకు విమానం ఇస్లామాబాద్‌కు చేరుకుంది. PIA తమ విమాన సేవలను సౌదీ అరేబియాకు విస్తరించిన రెండో రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.