గుడ్లు భలే టేస్టీగా ఉంటాయి. అంతేకాదు.. గుడ్లలో బోలెడన్ని పోషకాలు కూడా ఉంటాయి. అందుకే.. పిల్లల నుంచి పెద్దలు వరకు ప్రతి ఒకరు రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణం మనం గుడ్లను నీటిలో ఉడికించి తింటాం. అయితే, చైనాలోని డోంగ్యాంగ్ ప్రాంతంలో మాత్రం.. గుడ్లను మూత్రంలో ఉడికించి తింటారు. ఇందుకు బలమైన కారణమే ఉందని స్థానికులు చెబుతారు. చివరికి ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించింది.
డోంగ్యాంగ్‌లో సాయంత్రం కాగానే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లేందుకు స్కూళ్ల వద్ద క్యూ కడతారు. వారితోపాటు వ్యాపారులు సైతం స్కూళ్ల వద్దకు బకెట్లు, డ్రమ్ములతో చేరుకుంటారు. అయితే, వీరంతా వేచి చూసేది.. విద్యార్థుల కోసం కాదు. వారి మూత్రం కోసం. పిల్లలు ఇళ్లకు చేరగానే.. వ్యాపారులంతా స్కూల్‌లోని మూత్రశాలల్లోకి వెళ్లి.. యూరిన్‌ను సేకరిస్తారు. ముందుగానే స్కూళ్లలో ఏర్పాటుచేసిన డ్రమ్ముల్లోని మూత్రాన్ని కలెక్టు చేసుకుంటారు. ఆ తర్వాత ఆ మూత్రంలో గుడ్లు వేసి రోజంతా నానబెడతారు. ఆ తర్వాత వాటిని ఉడికించి, విక్రయిస్తారు.
10 ఏళ్ల లోపు పిల్లల మూత్రమే సేకరిస్తారు: ఈ గుడ్లను ఉడికించడానికి కేవలం 10 ఏళ్ల లోపు పిల్లల మూత్రాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఆ మూత్రంలో ఉడికించిన గుడ్లను ‘virgin boy eggs’ (వర్జిన్ బాయ్స్ ఎగ్స్) అని పిలుస్తారు. జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఈ గుడ్లను తింటారు. ముందుగా గుడ్లను ఒక రోజంతా మూత్రంలో నానబెడతారు. ఆ తర్వాత మూత్రంతో సహా పొయ్యిపై పెట్టి ఉడికిస్తారు. గుడ్డు పెంకు పగిలే వరకు ఆ గుడ్లను ఉడికిస్తారు. ఆ గుడ్లు మూత్రాన్ని పీల్చుకొనేవరకు ఉడికిస్తూనే ఉంటారు.
చాలా టేస్టీగా ఉంటాయట: ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయట. వాసన కూడా చాలా బాగుంటుందట. మూత్రంలో బాగా నానుతూ ఉడకం వల్ల ఆ గుడ్లలో ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదట. అయినా.. మూత్రంలో గుడ్లు ఉడికించడం ఏమిటీ? మీకేమైనా పిచ్చా అని అడిగితే.. ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ గుడ్లను తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని, రక్త ప్రసరణ మెరుగు పడుతుందని చెబుతున్నారు. నడుము, కాళ్ళు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. చాలా స్ట్రీట్ ఫుడ్స్‌లో ఈ గుడ్లను బజ్జీల్లా అమ్మేస్తుంటారు. అంతేకాదు.. స్థానికులు కూడా 10 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లల మూత్రాన్ని సేకరించి ఇళ్లలోనే ఈ రెసిపీని తయారు చేసుకుని స్నాక్స్‌లా ఆరగిస్తారు. అయితే, వైద్యులు మాత్రం ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తుంటే.. స్థానికులు మాత్రం మేం ఎన్నో ఏళ్ల నుంచి ఈ గుడ్లను తింటున్నామని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అనారోగ్యం రాలేదని అంటున్నారు.