ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ ఆర్ధిక రంగంపైనే కాదు ఆరోగ్య రంగంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఆర్ధికంగా ఎంత బలంగా ఉన్న దేశమైన ఆరోగ్యపరంగా కుదేలైతే ఎకానమీ పరంగా కూడా కూడా వెనకడుగు వేయకతప్పదు. అందుకు ఆరోగ్యవంతమైన ప్రజలను కలిగి ఉన్న దేశమే త్వరగా అభివృద్ధి చెందుతుందని చెబుతారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆరోగ్య రంగంలో ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగింది మనదేశం. ప్రజల సగటు ఆయుర్ధాయాన్ని పెంచేందుకు ఎంతో కృషి చేసింది. ఆ తీయని ఫలితాల్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.
సగటు ఆయుర్ధాయం ఎంత?
1947లో స్వాతంత్య్రం అయితే వచ్చింది కానీ ఆరోగ్యపరంగా మాత్రం భారతీయులు చాలా దీనస్థితిలో ఉన్నారు. వాటిరి సగటు ఆయుర్ధాయం కేవలం 32 ఏళ్లు. అంటే ఆ కాలంలో చాలా మంది బతికిన సగటు వయసు 32 ఏళ్లేనన్నమాట. యుక్త వయసులోనే రకరకాల రోగాల బారిన పడి మరణించేవారు ప్రజలు. దేశం మన చేతికి చిక్కాక నాయకులంతా ఆరోగ్య సంస్కరణలు చేపట్టారు. వాటి ఫలితంగా ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు. ఇది మనదేశ ఆరోగ్య రంగంలో సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు.
పోలియో మాయం
లక్షలాది మంది పిల్లల కాళ్లు, చేతులను పనికి రాకుండా చేసిన పోలియో మహమ్మారిని అంతమొందించడం కచ్చితంగా చెప్పుకోవాల్సిన విజయం. మనదేశంలో పోలియో చివరి కేసు 2010లో పశ్చిమబెంగాల్‌లో నమోదైంది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియోరహిత దేశంలో భారతదేశాన్ని ప్రకటించింది. 1990ల వరకు పోలియో మనదేశాన్ని వణికించింది. ఇక మశూచిని కూడా కాలగర్భంలో కలిపేశాయి మన ఆరోగ్య సంస్కరణలు. ఈ రెండు మహమ్మారులను అంతం చేసేందుకు వ్యాక్సిన్లు వేయించుకోవాలంటూ గ్రామగ్రామాన ప్రచారాలు చేశారు. వ్యాక్సిన్లు వేసుకుంటే తమకేదో అయిపోతుందని భావించే గ్రామీణ ప్రజలను ఒప్పించడం అప్పట్లో చాలా పెద్ద సమస్యగా మారింది. అయినా పట్టువదలకుండా మన ఆరోగ్య వ్యవస్థ వ్యాక్సిన్లను అందరికీ అందేలా చేసి పోలియో, మశూచి వంటి వాటి అంతానికి పూనుకుంది.
ప్రసూతి మరణాలు తగ్గాయి
ఐక్యరాజ్యసమితి చెప్పిన ప్రకారం మన దేశంలో శిశు, ప్రసూతి మరణాల రేటు కూడా చాలా తగ్గింది. 2022లో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాల్లో 27.695గా ఉంది. అంటే 1000 మంది జన్మిస్తే వారిలో 27 మంది దాకా పురిట్లోనే మరణిస్తున్నారు. కానీ 1940లలో ఈ పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. 2000 మంది జన్మిస్తే వారిలో 1000 శిశువులు మరణించేవారు. ప్రసూతి మరణాలు, శిశు మరణాలు తగ్గించడంలో భారత ఆరోగ్య వ్యవస్థ చాలా ప్రభావవంతంగా పనిచేసింది. 2030 నాటికి లక్ష జననాలకు 70 కంటే తక్కువ మరణాలు నమోదయ్యేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులతో పాటూ ఎయిడ్స్, క్షయ వంటి అంటువ్యాధులు తగ్గించేందుకు చాలా కష్టపడింది భారత ఆరోగ్య వ్యవస్థ. అంటు వ్యాధుల నివారణకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఒకప్పుడు మలేరియా బారిన లక్షల మంది పడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందల్లోనే ఉంది. కుష్టువ్యాధిని కూడా నిర్మూలించే దిశలో చాలా వరకు విజయవంతమయ్యారు. ప్రస్తుతం పదివేల మందిలో నలుగురి నుంచి అయిదు మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకప్పటి పరిస్థతితో పోల్చుకుంటే ఇది చాలా మెరుగైన పరిస్థితి.
Also read: రక్షా బంధనానికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పేయండిలా