కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పథకం సాధించి తెలంగాణకు క్రిీడా ప్రపంచంలో ఉన్నత స్థానం కల్పించిన ఆకుల శ్రీజకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అధికారులు, అభిమానులు శ్రీజను ఆహ్వానించారు. అతి చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయి పేరు తెచ్చుకున్న శ్రీజతో సెల్ఫీలకు పోటీ పడ్డారు.


హైదరబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉండే ప్రవీణ్‌కుమార్, సాయిసుధ దంపతుల బిడ్డే శ్రీజ. తండ్రి ప్రవీణ్ కుమార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు కావడంతో తండ్రిని చూసి ఆటపై చిన్నప్పటి నుంచే మక్కువ పెంచుకుంది. తొమ్మిదేళ్ల వయస్సులోనే టేబుల్ టెన్నీస్ ఆడటం ప్రారంభించింది. శ్రీజ ప్రతిభను గమనించిన తండ్రి ప్రవీణ్ అకాడమీలో చేర్పించి అనుభవం ఉన్న ఆటగాళ్లతో శిక్షణ ఇప్పించారు. 


చిన్నప్పటి నుంచే పట్టుదల ప్రాక్టీస్ చేసి టేబుల్ టెన్నిస్ క్రీడలో నైపుణ్యం సాధించింది శ్రీజ. 2009లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పథకాన్ని సాధించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆటపై మక్కువ వీడకుండా మరోవైపు చదువులోనూ ముందుకు దూసుకుపోయింది. ఓ పక్క టేబుల్ టెన్నీస్ మరోవైపు చదువు ఈ రెండిటినీ బ్యాలెన్స్‌ చేసుకొని రాణించింది. 


ఇప్పటి వరకూ జాతీయ స్థాయిలో 48కిపైగా పథకాలు, అంతర్జాతీయ స్థాయిలో 30కిపైగా పథకాలు సాధించింది శ్రీజ. తాజాగా కామన్ వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణ పథకం సాధించి మరోమారు సత్తాచాటించింది. ఓవైపు ఆటలో రాణించడమే కాకుండా చదువులోనూ మేటిగా నిలిచింది ఆకుల శ్రీజ. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు వెళుతూనే మార్గమధ్యలో చదువుకుంటూ ఉండేది. ఒక్కోసారి తన తల్లి చదివి శ్రీజకు పాఠాలు చెప్పేది. టేబుల్ టెన్నీ అకాడమిలో కోచింగ్ తీసుకుంటూనే చదువుల్లో టాపర్‌గా నిలిచింది. పదో తరగతిలో 9.5శాతంతో ఏ గ్రేడ్, ఇంటర్‌లో 97శాతం మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలిచింది. 






ఆటలో మేటిగా ఉంటూ జాతీయ స్థాయిలో మూడో ర్యాంకర్‌గా ఎదిగింది శ్రీజ. హైదరాబాద్ గ్లోబల్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్న శ్రీజ... కోచ్‌, మెంటార్‌ సోమనాథ్ ఘోష్ వద్ద బేసిక్స్‌ నేర్చుకుంది. పదేళ్లుగా హార్డ్‌ వర్క్‌ చేసి తాజాగా కామన్వెల్త్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శరత్‌ కమల్‌తోపాటు స్వర్ణం గెలిచింది. తండ్రిని చూసి ఆటపై ఆశక్తి పెంచుకున్న ఆకుల శ్రీజ నేడు అత్యుత్తమ స్థానానికి చేరుకుంది. తల్లిదండ్రులు, గురువు, తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని శ్రీజ హర్షం వ్యక్తం చేసింది. 


మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా మరిన్ని క్రీడా మైదానాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇప్పటికే  రెండువేలకుపైగా గ్రామాల్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేసామన్నారు. క్రీడల్లో రాణించిన వారికి రెండు శాతం రిజర్వేషన్లు అదనంగా కల్పించే విషయం తెలంగాణా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.