మునుగోడు మాదే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అంటున్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. నల్గొండ టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమదే విజయం ఖాయమంటున్నారు. హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హై స్కూల్ నిర్వహించిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన మహోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితతోపాటు ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


బీజేపీ తెరవెనుక రాజకీయాలు చేస్తోంది..


బిహార్ రాజకీయాలను యావత్ దేశం గమనిస్తోందన్నారు కవిత. బీజేపీ బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదని సూచించారు. అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, తెరవెనుక రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి వాటన్నింటికీ మునుగోడు ఉపఎన్నిక సమాధానం చెప్తుందని అభిప్రాయపడ్డారు.


 ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికల్లో టీఆర్ఎస్ హేమాహేమీలను ఓడించిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. బీజేపీ కావాలనే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించిందని ఆరోపించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం ఒక్క బీజేపీ నేతలకు మాత్రమే సాధ్యం అవుతుందని కవిత సెటైర్లు వేశారు. అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిదంని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.






రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత కోరారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను యథేచ్ఛగా పెంచారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పేదల కోసం 250 సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆమె వివరించారు. పేద ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వంగా తమ బాధ్యత అన్నారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించే ధోరణి ఉందని ఆమె అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. అర్వింద్ కు ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందని పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. 


మునుగోడులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే..!


కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు కవిత. కోమటిరెడ్డి  రాబోయే ఎన్నికల్లో గెలవననే విషయం అతడికి కూడా తెలుసని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తరచూ టీఆర్ఎస్‌ను తిట్టడం తప్ప మనుగోడు ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో కూడా తెరాస పార్టీ మునుగోడులో సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తు చేశారు. ఇటు పార్టీని నడపడంలోనూ, అటు ప్రభుత్వాన్ని నడపడంలోనూ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారని కవిత వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించేది తమ పార్టీయేనని ఆశాభావం వ్యక్తం చేశారు.