బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే జీవితాన్ని తలకిందులు చేస్తుంది. దీని నుంచి ఒక్కోసారి ప్రాణాలతో బయట పడొచ్చు. లేదంటే శరీరంలోని ఏదైనా అవయవం చచ్చుబడిపోయి జీవితం మొత్తం మంచానికి పరిమితం అయ్యే అవకాశాలు ఉంటాయి. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు, లేదంటే రక్తనాళం పగిలినప్పుడు స్ట్రోక్ ఏర్పడుతుంది.


బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కానీ వాటిని గుర్తించడం అంత ఈజీ కాదు. కానీ ఈ యాప్ ద్వారా స్ట్రోక్ సంకేతాలని గుర్తించి ప్రాణాలు రక్షించుకోవచ్చని తాజా అధ్యయనం సూచిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఫీచర్ AI ని ఉపయోగించి ముఖంలో వచ్చే మార్పులు, చేతుల్లోని కదలికలు, మాట తీరులో అస్పష్టత వంటి లక్షణాలు ఈ యాప్ గుర్తించగలుగుతుందని యూఎస్ పరిశోధకులు కనుగొన్నారు. ఇది మైక్రోఫోన్‌ను ఉపయోగించి స్పీచ్ మార్పులను గుర్తిస్తుంది. అది ధ్వని తరంగాలను ఇమేజ్‌లుగా మార్చి, అది సాధారణమైనదా లేదా అస్పష్టంగా ఉందా అని చూపిస్తుంది. 


240 మంది స్ట్రోక్ రోగుల వీడియోలని పరిశోధకులు పరిశీలించారు. ఈ యాప్ తో స్ట్రోక్ వల్ల వచ్చే ప్రాణాంతక పరిస్థితిని రాకుండా చూసుకోవచ్చు. స్ట్రోక్ రాకముందే లక్షణాలని అంచనా వేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు. స్ట్రోక్ తో ఏటా లక్ష మంది యూకే వాసులు బాధపడుతున్నారు. 35 వేల మంది మరణిస్తున్నారు. మెదడుకి రక్త సరఫరా ఆగిపోవడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. 85 శాతం కేసుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ఒక్కోసారి రక్తనాళం పగిలిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం, హార్ట్ బీట్ సరిగా లేని వ్యక్తులు ఎక్కువగా స్ట్రోక్ బారిన పడతారు. అయితే, యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.


స్ట్రోక్ లక్షణాలు


⦿ ముఖం ఒకవైపుకి పడిపోవడం. నవ్వలేక ఇబ్బందిపడతారు.


⦿ బలహీనత లేదా తిమ్మిరి కారణంగా చేతులు పైకి లేపలేకపోతారు


⦿ మాటల్లో తడబాటు, గజిబిజిగా వస్తాయి.


⦿ కాళ్ల, చేతుల్లో పక్షవాతం రావడం.


⦿ తీవ్రమైన తలనొప్పి.


⦿ చూపు మసకబారడం.


⦿ జ్ఞాపకశక్తి కోల్పోవడం


కొత్తగా తీసుకొచ్చిన ఈ యాప్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించగలిగిందా లేదా అనేది సొసైటీ ఆఫ్ న్యూరోఇంటర్వేన్షనల సర్జరీ 20వ వార్షిక సమావేశంలో వెల్లడించారు. బల్గేరియాలోని నాలుగు స్ట్రోక్ సెంటర్లలోని రోగుల్ని మూడు రోజుల పాటు ఈ యాప్ ఉపయోగించారు. యాప్ మొహంలో వచ్చే మార్పుల్ని కొలుస్తుంది. మోషన్ ట్రాకర్ ద్వారా చేయి బలహీనతలు అంచనా వేసింది. ఇక వీరికి ఇచ్చిన మైక్రోఫోన్ ద్వారా స్ట్రోక్ రోగుల్లోని స్పీచ్ లో వచ్చే మార్పులని పసిగట్టింది. మాట తీరు అస్పష్టంగా అనిపించగానే చూపించిందని పరిశోధకులు తెలిపారు.


బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హేమరేజిక్ స్ట్రోక్.  రక్తం గడ్డ కట్టడం వల్ల మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి ఇస్కిమిక్స్ స్ట్రోక్ వస్తుంది. రక్తనాళం పగిలిపోవడంవల్ల హేమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఈ రెండింటిలో అధికంగా వచ్చేవి ఇస్కిమిక్ స్ట్రోకే. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: రాత్రివేళ ఈ టిప్స్ పాటించారంటే నిగనిగలాడే చర్మం పొందవచ్చు