బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మనీ లాండరింగ్ తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బుక్కై నానా తిప్పులు పడుతుండగా, కొద్ది రోజుల క్రితం మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ పై పరువు నష్టం కేసు పెట్టింది. తాజాగా ఈ కేసులో నోరా ఫతేహి స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. “కొంత మంది నన్ను కావాలని టార్గెట్ చేశారు. మనీలాండరింగ్ సూత్రధారి సుకేష్ చంద్రశేఖర్‌తో నాకు సంబంధం ఉందని ఆరోపించారు. కొందరిని రక్షించడానికి మీడియాలో నన్ను బలిపశువుగా ఉపయోగించారు. ఈ కేసు కారణంగా నాకు జరిగిన అన్ని రకాల నష్టాలకు పరిహారం కావాలని కోరుతున్నాను. ఈ కేసులో నన్ను ఈడీ సాక్షిగా, తనను నిందితురాలిగా ఎందుకు తీసుకుందని జాక్వెలిన్ మీడియాను ప్రశ్నించింది. ఈ ప్రకటనతో నాకు ఎన్నో వేధింపులు ఎదురయ్యాయి. చాలా అవకాశాలను కోల్పోయాను. సైబర్ బెదిరింపులకు గురయ్యాను” అని న్యాయస్థానం ముందు నోరా ఆవేదన వ్యక్తం చేసింది.
అనసవరమైన విషయాల్లోకి జాక్వెలిన్ ను లాగకండి- ప్రశాంత్ పాటిల్
నోరా ఫతేహి స్టేట్మెంట్ ను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ న్యాయవాది ప్రశాంత్ పాటిల్ తప్పుబట్టారు. తన క్లయింట్‌ను అనవసరమైన వివాదంలోకి లాగుతోందని ఆరోపించారు. నోరా ఫతేహికి వ్యతిరేకంగా జాక్వెలిన్ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదని చెప్పారు. “ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ముందు జాక్వెలిన్.. నోరా ఫతేహిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఈ కేసు గురించి బయట ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున మౌనంగానే ఉంది. కానీ, కొందరు ఆమెను అనవసరమైన విషయాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు” అని వెల్లడించారు.
నోరా పరువు నష్టం కేసు ఎందుకు పెట్టిందంటే?
సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి గతంలో ఈడీ విచారణ కొనసాగింది. ఇందులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్ ను కూడా విచారించారు. ఎంక్వయిరీలో భాగంగా సుఖేష్ కు తనతో పాటు చాలా మంది బాలీవుడ్ స్టార్స్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అందులో నోరా ఫతేహి చాలా ముఖ్యమైన ఫ్రెండ్ అని చెప్పింది. ఈడీ విచారణలో తన పేరును ప్రస్తావించడం పట్ల జాక్వెలిన్ పై నోరా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సంబంధం లేని కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడింది. జాక్వెలిన్ తో పాటు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేసిన పలు వార్తా చానెళ్లపై పరువు నష్టం కేసు వేసింది. కొంతమంది తనను కావాలని మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించింది. తనకు సుఖేష్ తో ఎలాంటి స్నేహం లేదని తేల్చి చెప్పింది.
తప్పు చేయకపోతే అఫిడవిట్ దాఖలు చేయండి- విక్రమ్ సింగ్ చౌహాన్
అటు పరువు నష్టం కేసు విషయంలో నోరా ఫతేహి లాయర్ విక్రమ్ సింగ్ చౌహాన్ సైతం రియాక్ట్ అయ్యారు. జాక్వెలిన్ ఏ తప్పు చేయకపోతే, వెంటనే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలన్నారు.
Read Also: కోర్టు తీర్పు రిలీఫ్ ఇచ్చింది - నా కుటుంబం బాధపడుతోంది: నటుడు నరేష్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial