గత కొంతకాలంగా నటుడు నరేష్, పవిత్రా లోకేష్, రమ్య రఘుపతి వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి నటుడు నరేష్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లు సజావుగా సాగిన వీరి కాపురం తర్వాత మధ్య వివాదాలు మొదలైయ్యాయి. నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సన్నిహితంగా ఉంటుందనే వార్తలు రావడంతో వీరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఓ రోజు నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో కనిపించడంతో నరేష్, పవిత్రలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రమ్య.  అప్పటి నుంచి పలు సార్లు వీరి మధ్య పోలీస్ కేసులు నడిచాయి.  అప్పటి నుంచి వీరు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నరేష్ రమ్య మీద, రమ్య నరేష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు.


కోర్టును ఆశ్రయించిన రమ్య


తాజాగా నరేష్, పవిత్ర లోకేష్ హీరో, హీరోయిన్లుగా ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమా చేశారు. ఇందులో రమ్యను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా విడుదల కాకుండా చూడాలంటూ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘మళ్ళీ పెళ్లి'( తెలుగు), ‘మట్టే మదువే'(కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీలో విడుదల కాకుండా నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. అయితే, సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని ధృవీకరించిన తర్వాత సినిమా విడుదలను అడ్డుకోవడం కష్టమంటూ న్యాయస్థానం కేసు కొట్టివేసింది. ఈ సినిమా డిజిటల్ తో పాటు, శాటిలైట్ ద్వారా ప్రసారం చేసుకోవచ్చని చెప్పింది. అటు భార్య రమ్య రఘుపతిని హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఉన్న తన ఇంట్లోకి రాకుండా నిషేధించాలని నరేష్ వేసిన కేసుపైనా కోర్టు విచారణ జరిపి తీర్పు వెల్లడించింది.  నరేష్, అతడి కుటుంబ సభ్యులు అందజేసిన సాక్ష్యాధారాల  ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ ఉండటానికి వీల్లేదంటూ తీర్పును వెలువరించింది. రెండు కేసుల్లో రమ్యకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.  


కోర్టు తీర్పుల పట్ల నటుడు నరేష్ సంతోషం


న్యాయస్థానం తాజా తీర్పులపై నటుడు నరేష్ స్పందించారు. సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితానికి కూడా ఈ తీర్పులు మంచి రిలీఫ్ ఇచ్చాయని వెల్లడించారు. రమ్యను తన ఇంట్లోకి రాకుండా నిషేధించడం సంతోషంగా ఉందన్నారు. “ఆమె(రమ్య)కి చాలా అప్పులు ఉన్నాయి. అప్పులు వసూలు చేసేవారు మా ఇంటికి వచ్చేవారు. వారి వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి కూడా ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలోనే మేము కోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు ఆమె ఇంట్లోకి రాకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు తీర్పు, నేను కూకట్‌పల్లి కోర్టులో దాఖలు చేసిన విడాకుల కేసుకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఆమెతో వీలైనంత త్వరగా విడాకులు వస్తాయనుకుంటున్నాను. పవిత్రతో కలిసి ప్రశాంత జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది అనుకుంటున్నాను. ప్రస్తుతం కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా, ఈ రచ్చపట్ల నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు” అని నరేష్ తెలిపారు.


Read Also: లండన్‌లో మహేష్ బాబు బర్త్ డే వేడుకలు - జక్కన్న అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial