ఒంటరి జీవితం మానసిక ఆందోళనకు గురిచేస్తుంది. అది కాస్తా వ్యాధులకు దారితీస్తుంది. మనసంతా భారంగా.. జీవితంలో అన్నీ కోల్పోతున్నామనే భావన కలిగిస్తుంది. అంతేకాదు.. బుర్రలో ఏవేవో ఆలోచనలు నిద్రలేకుండా చేస్తాయి. ఆ బాధ శాస్వత నిద్రలోకి నెట్టేస్తుంది. అదే నలుగురితో కలిస్తే?
ఎక్కువ మంది స్నేహితులు ఉండడం మాత్రేమే కాదు, స్నేహాన్ని జీవితాంతం నిలుపుకోగలగటం అనేది చాలా ముఖ్యం. స్నేహమనేది కేవలం సామాజిక అంశం మాత్రమే కాదు అది ఆరోగ్యానికి ఔషధం వంటిది కూడా అని కొత్త అధ్యయనాలు తెలుపుతున్నాయి. బీజీ సోషల్ లైఫ్ లో ఉండేవారికి 11రకాల సైలెంట్ కిల్లర్స్ నుంచి ఉపశమనం దొరుకుతుందట. స్నేహం మధ్యవయస్కుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
లేట్ ఫార్టీస్ లో బంధుమిత్రులకు దగ్గరగా గడిపే వారికి గుండె సమస్యలు, కాన్సర్ వంటివి దరిచేరవట. మధ్యవయసులో ఉండే స్త్రీలు సోషల్ లైఫ్ లో బీజీగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటున్నారట. వయసు పెరిగేకొద్ది అటువంటి వారిలో అనారోగ్య సమస్యలు పెద్దగా చికాకు పెట్టడం లేదనేది ఈ అధ్యయన సారాంశం. మంచి సోషల్ లైఫ్ గడిపే వారిలో మానసిక సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటున్నట్టు తెలిసింది.
ఆస్ట్రేలియాలోని క్విన్ లాండ్ యూనివర్సిటికి చెందిన పరిశోధకులు ఆస్ట్రేలియాకు చెందిన 7,700 మంది 40-45 మధ్య వయసున్న మహిళల నుంచి ఈ డేటాను సేకరించారు. మధ్య వయసు నంచి వృద్ధాప్యం వరకు కూడా మంచి సామాజిక సంబంధాలు కలిగి ఉన్న వారు లేదా కొత్తగా సామాజిక సంబంధాలు ఏర్పరుచుకున్న వారు మరింత ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటున్నారని ఈ అధ్యయన రచయిత డాక్టర్ జియోలిన్ జూ చెబుతున్నారు.
మంచి సామాజిక సంబంధాలు ఆరోగ్యానికి అవసరం. ఈ స్టడీలో పాల్గొన్న మహిళలను వారు తమ భాగస్వాములు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలతో ఎంత సంతృప్తిగా ఉన్నారనే విషయలా గురించి ప్రశ్నించి తెలుసుకున్నారు. 20 సంవత్సరాల సమయంలో జరిగిన అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యలు, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్, క్రానిక్ అబ్స్ స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, ఆస్టియో పోరోసిస్, డిప్రెషన్, ఆంక్జైటీ వంటి 11 ముఖ్యమైన విషయాలను ట్రాక్ చేశారు.
తమ సామాజిక జీవితంతో సంతృప్తిగా లేని మహిళలు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్యాల బారిన పడే ప్రమాదం 2.4 రెట్లు ఎక్కువ. పైన చెప్పిన అన్ని అనారోగ్యాలకు రకరకాల కారణాలు ఉండొచ్చు వాటిలో సోషల్ లైఫ్ సాటిస్పాక్షన్ కూడా అందులో ఒకటి అని డాక్టర్ జూ సైకియాట్రీ జర్నల్ లో వ్యాఖ్యానించారు.
మధ్య వయసు వారికి మరింత సామాజిక జీవితం కలిగి ఉండాల్సిందిగా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. అందుకు కొత్త స్నేహితులను చేసుకోవాల్సిందిగా, క్లబ్ లు , సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా సలహా ఇస్తున్నారు. మెదడు చురుకుగా ఉండేందుకు తగినంత శారీరక శ్రమ చాలా అవసరమని కూడా సూచిస్తున్నారు. 1,417 మంది 30 సంవత్సరాల పైబడిన వయసు వారిపై జరిపిన అధ్యయనంలో శారీరకంగా చురుకుగా ఉన్న వ్యక్తుల్లో చాలా మంది 69 సంవత్సరాల వయసులోనూ చురుకైన మెదడు కలిగి ఉన్నారట. వీరిలో చాలా మంది నెలలో కనీసం 4,5 సార్లు మాత్రమే వర్కవుట్ చేసిన వారు కూడా ఉన్నారు. జీవిత పర్యంతం ఎంత చురుకుగా సమయం గడిపామనేది వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండేందుకు చాలాముఖ్యమైన విషయం అని న్యూరాలజి, సైకియాట్రీకి సంబంధించిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మీ మూత్రం రంగును బట్టి రోగాన్ని చెప్పేయొచ్చు - ఈ రంగులోకి మారితే జాగ్రత్త!