వేసవిలో చర్మం సంరక్షణ చాలా ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు చర్మానికి తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయాలి. అలాగే నిండుగా దుస్తులు ధరించాలి. తలను క్యాప్ లేదా క్లాత్‌తో కప్పుకోవాలి. అయితే, సన్ స్క్రీన్ లోషన్స్ విషయంలో చాలా అపోహలు చక్కర్లు కొడుతున్నాయి. చర్మం నల్లగా ఉంటే సన్ స్క్రీన్ అవసరం ఉండదని కొందరు. సన్ స్క్రీన్ లోషన్ రాస్తే చర్మం నల్లగా మారిపోతుందని మరికొందరు భావిస్తారు. అయితే, ‘సన్ స్క్రీన్’ లోషన్ చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుందనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. దీనికి చర్మం రంగుతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే సన్‌స్క్రీన్ లోషన్‌ను కేవలం వేసవిలో అప్లై చేస్తే చాలు, మిగతా కాలాల్లో రాయాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటారు. కానీ, అది కూడా అపోహే. సన్‌స్క్రీన్‌పై ఇంకా ఎన్నో అపోహలు మీరు వినే ఉంటారు. మరి అవి ఎంత వరకు నిజమో తెలుసుకోండి. 


Sun Screen Lotion ఎందుకు రాసుకోవాలి?: సన్‌స్క్రీన్ అపోహల గురించి తెలుసుకోడానికి ముందు మీరు UVA, UVB అనే అతినీలలోహిత కిరణాలపై అవగాహన అవసరం. మనం ఎండలో అడుగుపెట్టిన వెంటనే చర్మం UV కిరణాలు పడతాయి. దీనికి కాలంతో పనిలేదు. వేసవిలోనే కాకుండా మేఘాలతో నిండి ఉండే వర్షాకాలం, శీతాకాలాల్లో సైతం యూవీ కిరణాల ప్రభావం చర్మంపై ఉంటుంది.


UVA కిరణాలంటే..: UVA కిరణాలు చర్మంలోని మందమైన పొరలోకి చొచ్చుకుపోతాయి. దీన్ని ‘డెర్మిస్’ అని పిలుస్తారు. UVA కిరణాల వల్ల చర్మం ముడతలు పడటమే కాకుండా, వృద్ధాప్య చాయలు కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. 


UVB కిరాణాలంటే..: UVB కిరణాలు తక్కువ వేవ్ కలిగి ఉంటాయి. ఇవి చర్మం పై పొరను కాల్చేస్తాయి. UVB కిరణాలు చర్మ క్యాన్సర్‌కు దారితీస్తాయి. యూవీబీ కిరణాల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకావశాలు కూడా ఎక్కువే.


అపోహలు - వాస్తవాలు: 
అపోహ: సన్‌స్క్రీన్ ఎల్లప్పుడూ అవసరం లేదు:
వాస్తవం: చాలామంది ఈత కొట్టేప్పుడో, దుస్తులు పూర్తిగా ధరించనప్పుడో సన్‌స్క్రీన్ అవసరమని భావిస్తారు. ఆకాశం మేఘావృతమైన రోజుల్లో కూడా సన్‌స్క్రీన్ అవసరలేదని అంటారు. అయితే, చర్మంలోని చిన్న భాగానికి సూర్య రశ్మి తగిలినా యూవీ కిరాణాల ప్రభావం పడుతుంది. కాబట్టి, ఇంటి నుంచి బయటకు వెళ్లే  ముందు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. చివరికి ఆకాశం మేఘావృతమైన రోజుల్లో కూడా సన్‌స్క్రీన్ తప్పనిసరి. మబ్బులతో సూర్యుడు కనిపించకపోయినా యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. మేకప్ సూర్యుడి నుండి కొద్దిగా రక్షణ అందిస్తుంది. కానీ, అది సన్‌స్క్రీన్‌కు ప్రత్యామ్నాయం కాదు.  


అపోహ: సన్‌స్క్రీన్ శరీరం ‘విటమిన్-D’ని గ్రహించకుండా చేస్తుంది.
వాస్తవం: శరీరానికి ‘విటమిన్-డి’ ఎంత ముఖ్యమో మీకు తెలిసిందే. UV కిరాణాలు శరీరాన్ని తాకినప్పుడు మనకు ‘విటమిన్-D’ లభిస్తుంది. అయితే, సన్‌స్క్రీన్ లోషన్ UV కిరణాలు అడ్డుకుంటుంది. దానివల్ల శరీరం ‘విటమిన్-డి’ని గ్రహించలేదని చెబుతారు. అయితే, శరీరానికి ‘విటమిన్-డి’ లభించాలంటే రోజంతా ఎండలో ఉండాల్సిన అవసరం లేదు. రోజుకు అరగంట సేపు చర్మానికి ఎండ తగిలితే చాలు. అలాగే, మనం రాసుకొనే సన్‌స్క్రీన్ లోషన్ కేవలం 2 నుంచి 3 గంటలకు మించి ఉండదు. కాబట్టి, సన్‌స్క్రీన్ రాసినా ఏదో ఒక రూపంలో సూర్యరశ్మి ద్వారా మీకు విటమిన్-డి లభిస్తుంది. 


అపోహ: సన్‌స్క్రీన్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
వాస్తవం: ఈ అపోహ చాలా పాతది. సన్‌స్క్రీన్‌లలో క్రియాశీల పదార్ధాలలో ఒకటైన ఆక్సిబెంజోన్‌పై చేసిన పాత అధ్యయనం వల్ల ఈ అపోహ పుట్టింది. అప్పట్లో ఆక్సిబెంజోన్‌కు గురైన ఎలుకలు తీవ్రమైన ప్రతికూల దుష్ప్రభావాలను ఎదుర్కొన్నాయి. ‘ఎక్స్పోజర్’ స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్లే ఎలుకలకు ఆ పరిస్థితి వచ్చిందన్నారు. అయితే, మనుషులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆ పరిశోధనలో పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా సన్‌స్క్రీన్‌లలో ‘ఆక్సిబెంజోన్’ను మూల పదార్థంగా వాడుతున్నారు. ‘ఆక్సిబెంజోన్’ గ్రహించిన వ్యక్తులు విషపూరిత ప్రభావాలకు గురైన కేసులేవీ నమోదు కాలేదన్నారు.  


అపోహ: డార్క్ స్కిన్ ఉన్నవారికి సన్ స్క్రీన్ అవసరం లేదు
వాస్తవం: చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉన్నవారు సన్‌స్క్రీన్ ఉపయోగించాల్సిన అవసరం లేదని కొందరు నమ్ముతారు. ఎందుకంటే మెలనిన్ UVB కిరణాలను గ్రహించి వడదెబ్బ నుంచి కాపాడుతుంది. ముదురు రంగు చర్మం కలిగిన వ్యక్తులకు సూర్యరశ్మి నుంచి పెద్దగా ప్రమాదం లేకపోయినా.. వారు తప్పకుండా స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. ఎందుకంటే, మెలనిన్ UVA కిరణాలు అడ్డుకోలేదు. చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే డార్క్ స్కిన్ వ్యక్తులు సైతం సన్‌స్క్రీన్ రాసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే చర్మ క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 


అపోహ: సన్‌స్క్రీన్ రోజంతా రక్షణ కల్పిస్తుంది.
వాస్తవం: ఒక్కసారి చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకుంటే.. అది రోజంతా సూర్యరశ్మి నుంచి కాపాడుతుందని చాలామంది నమ్ముతారు. వాస్తవానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం మంచిదే. కానీ, అది రోజంతా రక్షిస్తుందని అనుకోవడం మాత్రమే అపోహే. సన్‌స్క్రీన్ కాంతిలో విచ్ఛిన్నమవుతుంది. తక్కువ వ్యవధిలో దాని ప్రభావాన్ని కోల్పోతుంది. రోజూ ప్రతి 2 నుంచి 4 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను చర్మానికి అప్లై చేయాలి. అయితే, సన్‌స్క్రీన్ రాసుకున్నాం కదా అని ఎండలో ఎక్కువగా గడపకూడదు. సన్‌స్క్రీన్ కంటే దుస్తులే ఎక్కువ రక్షణ కల్పిస్తాయి.  


అపోహ: సన్‌స్క్రీన్ వాటర్ ప్రూఫ్‌లా పనిచేస్తుంది
వాస్తవం: వాటర్ ప్రూఫ్ లేదా చెమట-నిరోధక సన్‌స్క్రీన్స్ కేవలం క్రీడాకారుల కోసం తయారు చేసినది. అయితే, అవి 100 శాతం వాటర్ ప్రూఫ్‌ కాదు. నీటిలోకి వెళ్లిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత అది తొలగిపోతుంది. దాని ప్రభావం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. 


Also Read: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది! 


అపోహ: అన్ని సన్‌స్క్రీన్‌లు ఒకేలా ఉంటాయి
వాస్తవం: అన్ని సన్‌స్క్రీన్‌లు దాదాపు ఒకేలా ఉంటాయి. అదే పనిని చేస్తాయని ఒక అపోహ ఉంది. సన్‌స్క్రీన్‌లలో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. అవి వివిధ సూర్యరశ్మికి గురికాకుండా కాపాడతాయి. టైటానియం డయాక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఎకామ్సూల్ వంటి క్రియాశీల పదార్థాలను తరచుగా UVA, UVB కిరణాలను ఫిల్టర్ చేయడానికి ఉపయోగిస్తారు. ‘అవోబెంజోన్’ వంటి రసాయన బ్లాకర్లు కూడా ఉన్నాయి. ఈ పదార్ధాలన్నీ సూర్యరశ్మిని వివిధ మార్గాల్లో నిరోధిస్తాయి. స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇందుకు మీరు Sun Protection Factor (SPF) ప్రామాణికంగా తీసుకోవాలి.  యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సూచన ప్రకారం.. మేఘావృతమైన రోజులలో కూడా 15 లేదా అంతకంటే ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా చర్మానికి అప్లై చేయాలి. 


Also Read: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి


అపోహ: సన్‌స్క్రీన్ లోషన్లకు ఎక్స్‌పైరీ ఉండదు
వాస్తవం: అన్ని వస్తువుల తరహాలనే సన్‌స్క్రీన్ లోషన్స్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కానీ, చాలామంది గడువు దాటినా కూడా వాటిని వాడేస్తుంటారు. ఆ లోషన్స్‌లో ఉండే క్రియాశీల పదార్థాలు కాలక్రమేణా విచ్ఛిన్నమవుతాయి. గడువు ముగిసిన సన్‌స్క్రీన్ లోషన్ చర్మానికి హాని కలిగించవచ్చు. 


సన్ స్క్రీన్‌ను చర్మానికి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా ఉపయోగించాలనే సందేహాలకు వైద్య నిపుణుల డెర్మటాలజిస్ట్ డాక్టర్ ప్రియ ఇచ్చిన సూచనలను కింది ఇన్‌స్టా వీడియోలో చూడండి: