3 Years of YSR Congress Party Rule :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి చేపట్టి మూడేళ్లు అయింది. ఈ మూడేళ్ల కాలంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ఆర్థిక పరమైన సవాళ్లు.. కరోనా లాంటి పరిస్థితులు.. అందులో కీలకమైనవి. వాటిని సీఎం జగన్ ఎలా అధిగమించారు ? ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయగలిగారా ?


జగన్ ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ కరోనా !


ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొద్ది నెలలకే జగన్‌కు అతిపెద్ద సవాల్ ఎదురైంది. ప్రపంచంపై కరోనా రూపంలో మహమ్మారి విరుచుకుపడింది. ఫలితంగా జగన్ తన నాయకత్వ సామర్థ్యాన్ని మొదటి సారిగా బయటపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంది. మొదటగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కీలకమైంది. లాక్ డౌన్ విధింపులో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా .. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనుకున్నది అనుకున్నట్లుగా కఠినంగా లాక్ డౌన్ అమలు చేశారు. అత్యంత సమర్థంగా లాక్ డౌన్ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తుకు తెచ్చుకుంది. 


కరోనాపై విజయం ! 


దేశ సగటుతో పోలిస్తే కరోనా కేసులు... మరణాలు ఏపీలో తక్కువ. సీఎం జగన్ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించారు.  కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని... గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు వ్యవస్థలూ ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది వగైరాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్ని కరోనా బారి నుంచి కాపాడటానికి వీలైనంత ప్రయత్నం చేశారు. వైద్య సాయం అవసరమున్న వివిధ వ్యాధిగ్రస్తులకు, గర్భిణిలకు లాక్‌ డౌన్‌ల వల్ల సమస్యలెదురుకాకుండా వారి ఇళ్లవద్దే మందులు, పౌష్టికాహారం వంటివి అంద జేశారు. కరోనా సవాల్‌ను సీఎం జగన్ సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. 


కరోనా వల్ల ఆర్థిక సవాళ్లు !
 
లాక్‌డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్న పరిశ్రమలు అదే దారిలో నడిచాయి. దేశంలో 4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు.   జీడీపీలో 7 నుంచి 8 శాతం నష్టపోయింది. అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గిపోయింది.  ఫలితంగా ఏపీ ప్రభుత్వం రూ. పాతిక వేల కోట్ల వరకూ ఆదాయం కోల్పోయిందని తెలుస్తోంది.  కరోనా లాక్‌డౌన్‌లోనూ, ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడలేదు. 2020–21లో కోవిడ్‌ లాక్‌డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయింది. 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం రూ.57,601 కోట్లు రాగా ఆ మరుసటి సంవత్సరం 2020–21లో రూ.57,427 కోట్లు మాత్రమే వచ్చిందని పేర్కొంది. అంటే.. 2019–20లో వచ్చిన ఆదాయం కూడా 2020–21లో రాలేదు. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి నేరుగా నగదు బదిలీ చేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఈ ఆర్థిక సవాళ్లను జగన్ సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. 


ఉద్యోగుల సమ్మె సవాల్ !


ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ఈ మూడేళ్లలో ఉద్యోగుల నుంచే ఓ సవాల్ ఎదుర్కొంది . పీఆర్సీ కోసం వారు సమ్మె బాట పట్టినంత పని చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగుల డిమాండ్‌ను పరిష్కరించలేని పరిస్థితుల్లో  ప్రభుత్వం పడింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నట్లుగా ప్రకటించాయి.  అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉద్యోగులు జీవితాంతం సమ్మె చేయలేరుగా... ఎప్పుడైనా ప్రభుత్వం వద్దకు రావాల్సిందేనని నమ్మింది. చివరికి ఉద్యోగులకు అదే తప్పలేదు.  ఉద్యోగుల సమస్య పరిష్కారం కావాల్సింది ప్రభుత్వం దగ్గరే.  ఆ విషయం తెలిసింది కాబట్టి ప్రభుత్వం ఈ సవాల్‌ను కూడా సింపుల్‌గా ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. 


సవాళ్లను ఎదుర్కొన్న తీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు !


కరోనాతో వచ్చిన సవాళ్లను ఎదుర్కొన్న విషయంలో ప్రజల నుంచి ప్రభుత్వానికి  భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంత మంది సమర్థంగా వ్యవహరించారని అంటారు. కానీ కొంత మంది మాత్రం ప్రకటనలు తప్ప చేతల్లో ఏమీ చేయలేదని .. జరగాల్సింది జరిగిపోయిందని అంటూ ఉంటారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ... ముందుగా తగ్గించి.. ఆ తర్వాత పాత వాటినే కొన్ని పునరుద్ధించే వ్యూహం చేశారు కానీ నిజంగా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించలేదంటున్నారు