దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో   57 రాజ్య‌స‌భ స్థానాల‌కు జూన్ 10వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే రోజున సాయంత్రం ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్నారు. నామినేష‌న్‌కు చివ‌రి గ‌డువు మే 31వ తేదీ. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. యూపీలో 11, ఏపీలో 4, రాజ‌స్థాన్ లో 4, చ‌త్తీస్‌ఘ‌డ్ లో 4, జార్ఖండ్ లో 2, మ‌హారాష్ట్రలో 6, త‌మిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్త‌రాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హ‌ర్యానాలో రెండు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూడు, ఒడిశాలో3 స్థానాలు ఉన్నాయి.  


ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ నాలుగు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి, భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీ కాలం జూన్‌ 21వ తేదీన ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మద్దతు వైఎస్ఆర్‌సీపీకే ఎక్కువగా ఉన్నందున నాలుగు స్థానాలు ఆ పార్టీకే దక్కనున్నాయి.  ప్రస్తుతం విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నథ్వాని.. వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. విజయసాయిరెడ్డిని రీ నామినేట్ చేస్తే.. మిగిలిన మూడు స్థానాల్లో ఎవరిని  ఎంపిక చేస్తుందనేది ఆ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. 


తెలంగాణ నుంచి టీఆర్ఎస్‌కు చెందిన ధర్మపురి శ్రీనివాస్ తో పాటు కెప్టెన్ లక్ష్మికాంతరావు పదవీ కాలం ముగుస్తోంది. డీఎస్ పార్టీకి దూరంగా కాగా లక్ష్మికాంతరావు వయోభారంతో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే పరిస్థితుల్లో లేరు. దీంతో టీఆర్ఎస్ అధినేత కొత్త వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే  ఎమ్మెల్సీగా ఎన్నికైన బండిపకాష్‌ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీ భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్‌ విడుదల చేసింది. గురువారమే ఈ ఉపఎన్నిక  నోటిఫికేషన్‌ను విడుదలయింది.  నామినేషన్ల దాఖలుకు మే 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. మే 30న ఉప ఎన్నిక నిర్వహించనుంది. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు పోలింగ్‌ నిర్వహించి, అదేరోజు ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభమవగానే.. మరో రెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది.