Mumbai BKC Companies Ask Employees To Work From Home Due To Anant Ambani Wedding Traffic: భారతీయ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ మెడలో ఇవాళ మూడు ముళ్లు వేయబోతున్నారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు. ప్రపంచ ప్రముఖుల రాకతో ముంబై నగరం రద్దీగా మారిపోయింది.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీలు
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి కారణంగా ముంబై పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరువుతున్న నేపథ్యంలో ఈ పెళ్లిని ముంబై పోలీసులు పబ్లిక్ ఈవెంట్ గా గుర్తించారు. పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని చోట్ల ట్రాఫిక్ పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని పలు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూలై 15 దాకా వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించాయి. అంబానీ పెళ్లి వేడుకలు జులై 14 వరకు జరగనున్న నేపథ్యంలో.. జూలై 15 వరకు ఉద్యోగులు ఇంటి నుంచి వర్క్ చేయాలని వెల్లడించాయి.
ముంబైకి ప్రపంచ ప్రముఖుల రాక
అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు భారత ప్రభుత్వానికి సంబంధించిన పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులు, ప్రపంచ ప్రఖ్యాత రియాలిటీ షో హోస్టులు కిమ్ కర్దాషియాన్, ఖోలీ కర్దాషియాన్, యూకే మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్, టోనీ బ్లేయర్, లాక్‌హీడ్ మార్టిన్ సీఈవో జేమ్స్ టైక్లెట్, ప్రెట్ ఎ మ్యాంగర్ సీఈవో పనో క్రిస్టౌ, ఆరామ్ కో అధినేత అమిన్ నాసర్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో సహా బాలీవుడ్, హాలీవుడ్, వ్యాపార, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
భారీగా పెరిగిన హోటల్ రూమ్స్ ధరలు
అంబానీ పెళ్లి కోసం దేశ, విదేశాల నుంచి అతిథులు వస్తున్న నేపథ్యంలో అంబానీ ఫ్యామిలీ.. ఐటీసీ, ది లలిత్, తాజ్ సహా పలు హోటళ్లలో అకాంబినేషన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుక నేపథ్యంలో ముంబైలోని పలు హోటళ్లలో గదుల రేట్లను భారీగా పెంచాయి. లగ్జరీ హోటళ్లు ఒక రాత్రికి లక్ష రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ట్రైడెంట్, ఒబెరాయ్ లాంటి హోటళ్లు ఇప్పటికే ఫుల్ అయ్యాయి. ముంబైలోని చాలా హోటళ్ల వెబ్ సైట్లలో జులై 14 వరకు గదులు ఖాళీగా లేవని దర్శనం ఇస్తున్నాయి.
పెళ్లి వేడుకలో రామ్ చరణ్ దంపతులు
ఇవాళ పెళ్లి వేడుక జరగనుండగా, రేపు ఆశీర్వాద్ వేడుక నిర్వహించనున్నారు. ఎల్లుండి, పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ దిగ్గజాలు తరలి రానున్నారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. ఈ పెళ్లికి వెళ్లే ఒకే ఒక్క తెలుగు స్టార్ కూడా ఆయనే కావడం విశేషం. ఇప్పటికే ఈ పెళ్లి కోసం రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లారు.
Also Read: అది పెళ్లి కాదు, ఓ సర్కస్ - అనంత్ అంబానీ పెళ్లి వేడుకలపై బాలీవుడ్ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్