Case Filed On Ex CM Jagan And IPS Officer: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సహా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌లపై (Sunil Kumar) గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు వైసీపీ అధినేత జగన్, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై కేసు ఫైల్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజద్రోహం చట్టం కింద తనను అరెస్ట్ చేసి వేధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు అధికారుల పేర్లనూ ఆయన ప్రస్తావించారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని.. హత్యాయత్నం చేశారని చెప్పారు. తప్పుడు నివేదికలు ఇచ్చారని అన్నారు.


వీరిపైనే కేసులు నమోదు


సునీల్ కుమార్ (A1), ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు (A2), జగన్ (A3), అప్పటీ సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్ (A4), గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (A5)లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ ఫిర్యాదు మేరకు వీరిపై హత్యాయత్నం, తప్పుడు నివేదికలు ఇవ్వడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి అంశాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీటిలో బెయిలబుల్, నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి.


స్పందించిన సీఐడీ మాజీ డీజీ






అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి.. సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.' అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.


మాజీ ఎంపీకి నోటీసులు


మరోవైపు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో ఆయనకు చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని.. లేకుంటా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులిచ్చారు.


Also Read: Nara Chandrababu Naidu : చంద్రబాబు పాలనకు నెల రోజులు - ఓపెనింగ్ అదుర్స్ - ముందు ముందు ఎన్నో సవాళ్లు !