Telangana Crime News: పోలీసులు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా...ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు(Cyber Frauds) రకరకాల పేర్లతో వలవేసి డబ్బులు దోచుకుంటూనే ఉంటున్నారు. జీవితకాల కష్టాన్ని ఒక్క క్షణంలో మాయం చేస్తున్నారు. కొందరి అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నారు. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ముగ్గురు విశ్రాంత ఉద్యోగుల నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు లూటీ చేసి పోలీసులకే సవాల్‌ విసిరారు. దశాబ్దాలపాటు  ఉద్యోగం చేసి దాచుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి దోచేశారు.


షేర్లపేరిట బురిడీ
హైదరాబాద్‌(Hydearabad) కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యాపారిని షేర్ల బిజినెస్‌ పేరిట ముగ్గులోకి దింపారు. గోల్డ్‌మన్ సాచ్‌ బిజినెస్‌ స్కూల్‌(Bussiness School)లో చేరాలంటూ అతనికి ఒక మెసేజ్ పంపారు.  ఆ తర్వాత ఓ వాట్సప్ గ్రూప్‌లో అతన్ని చేర్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా సాధించాలో శిక్షణ ఇస్తామంటూ నమ్మబలికారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఒక లేడి రంగంలోకి దిగింది. మాయమాటలతో ఆ వ్యాపారిని బురిడీ కొట్టించింది. యాప్‌స్టోర్‌ నుంచి ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి  అందులో పలు దఫాలుగా  ఆ వ్యాపారితో 5.9 కోట్లు పెట్టుబడి పెట్టించింది. యాప్‌లో ఆ విలువ 21 కోట్లుగా కనిపించేది. లాభాల్లో నుంచి కొంత మొత్తం ఉపసంహరించుకుంటానని వ్యాపారి చెప్పగా...లాభాల్లో నుంచి 20శాతం మినహాయించుకుంటామని చెప్పారు.  ఇదే విషయమైన వాట్సాప్‌ గ్రూప్‌(Whatsup Group)లోని మిగిలిన సభ్యులతో చర్చించేందుకు ప్రయత్నించగా...ఆ గ్రూప్‌లో సభ్యులు ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత పెట్టుబడి పెట్టించిన మహిళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించారు. 


విశ్రాంత ఏఈని బోల్తా కొట్టించిన నేరగాళ్లు
హైదరాబాద్ నాచారం(Naacharam)లో ఉంటే  విశ్రాంత విద్యుత్ ఏఈ(A.E)ని సైతం సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ముంబయి(Mumbai)లోని టెలికాం హెడ్ ఆఫీసు నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ  ఆయనకు ఫోన్ చేశారు. మీ ఫోన్‌ నుంచి ఇతరులకు  వేధింపుకాల్స్‌, అసభ్య మెసేజ్‌లు వస్తున్నాయని ఫిర్యాదులు అందాయని...అవతలి వారు బెదిరించారు. తాను ఎలాంటి సిమ్‌ తీసుకోలేదని వృద్ధుడు చెప్పినా వినకుండా ముంబయి పోలీసులతో మాట్లాడాలంటూ  ఆ కాల్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అవతలి వ్యక్తి ముంబయిలోని ఓ స్టేషన్‌కు ఎస్సైగా పరిచయం చేసుకున్నారు. ఈ పేరిట మహిళలు ఫిర్యాదు చేశారని చెప్పగా...తాను అలాంటివాడిని కాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అయితే స్కైప్‌ ద్వారా ఫిర్యాదు చేయాల్సిందిగా  ఎస్సైగా పరిచయం చేసుకున్న వ్యక్తి సూచించారు. తన ఫోన్‌లో స్కైప్‌ లేదని చెప్పడంతో వదిలేశాడు. మరికాసేపటికి మరో వ్యక్తి ఐపీఎస్‌ అధికారినంటూ ఫోన్ చేసి మనీలాండరింగ్ కేసు నమోదైందని...తాను చెప్పినట్లు చేస్తే ఈ కేసు నుంచి బయటపడొచ్చని సూచించారు. అలా వృద్ధుడి ఖాతాలో నుంచి డబ్బులతోపాటు మ్యూచివల్ ఫండ్లు, ఎఫ్‌డీలు(F.D.), ఎల్‌ఐసీ(L.I.C.) బాండ్లు అన్నింటి నుంచి డబ్బులు డ్రా చేయించి దోచేసుకున్నారు. సుమారు 4.82 కోట్లు కాజేశారు. ఇంకా డబ్బులు పంపాలని వేధిస్తుండటంతో  మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు..


మరో వృద్ధుడికి గాలం
రామచంద్రాపురం భెల్ టౌన్‌షిప్‌లో ఉండే మరో వృద్ధిడికి సైబర్ నేరగాళ్లు గాలం వేసి ఏకంగా ఐదుకోట్ల వరకు దోచుకున్నారు. వృద్ధుడికి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరాళ్లు సీబీఐ(C.B.I) అధికారినంటూ పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్‌కార్డుతో సిమ్‌తీసుకున్న ఓ వ్యక్తి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని...మీకు శిక్షపడటం తప్పదని భయపెట్టాడు. దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించేందుకు వీడియోకాల్‌ మాట్లాడాలని కోరారు. ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమంటూ మరింత భయపెట్టారు. సుప్రీంకోర్టు పరిశీలన కోసం తాము సూచించిన ఖాతాలోకి మీ దగ్గర ఉన్న నగదు మొత్తం ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరారు. ఈ కేసుతో మీకు సంబంధం లేకుంటే కోర్టు ద్వారానే ఆ నగదు మొత్తం తిరిగి తీసుకోవచ్చని సూచించారు. నిజమేనని నమ్మిన వృద్ధుడు మే 20 నుంచి జూన్ 20 వరకు పలు ధపాలుగా 4.98 కోట్లు వారు సూచించిన ఖాతాలో జమ చేశారు. నెలన్నర గడుస్తున్నా డబ్బులు తిరిగి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.