Hyderabad News: బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే 14 మంది ప్రజాప్రతినిధులు పార్టీ మారగా... ఇప్పుడు మరికొందరు అదే లైన్‌లో ఉన్నారు. ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం గూటికి చేరనున్నారు. ఇదే బాటలో మరో ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనే టాగ్ బలంగా వినిపిస్తోంది. 


పార్టీ నేతల వలస కట్టడికి బీఆర్‌ఎస్ అధినాయకత్వం చేస్తున్న కట్టడి ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. ఫిరాయింపులు నిరోధించేందుకు కోర్టుల్లో పోరాటం, నేతలను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ప్రభావం చూపడం లేదు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న వారంతా ఇప్పుడు పార్టీ ఫిరాయించడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. 


తాజాగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎమ్మెల్యేలంతా పార్టీ మారడానికి సిద్ధపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ చేరికను కన్ఫామ్ చేశారు. అదే బాటలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. వచ్చే వారంలో రోజుల్లో వలస తీవ్ర మరింత ఎక్కువగా ఉంటుందని ఇరు పార్టీల నాయకులు అంటున్నారు. 


పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలు తమ సన్నిహితులతో మాట్లాడుతున్నారు. ఫోన్‌లలో ప్రత్యేక మీటింగ్‌లు పెట్టుకొని పార్టీ మార్పు, ఇతర పరిణామాలపై చర్చించుకుంటున్నారు. వారి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ స్థానానికి కేకే రాజీనామా చేయడం ఆమోదం కూడా జరిగిపోయింది. మిగతా వాళ్లు మాత్రం రాజీనామాలపై నోరు ఎత్తడం లేదు. 


ఈ మధ్య కాలంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ అధికార పార్టీ అక్రమంగా తమ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటుందని ఆరోపించారు. గతంలో తాము పార్టీ ఎల్పీలను మాత్రమే పార్టీలో విలీనం చేశామని ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని అది ఫిరాయింపు కాదని అంటున్నారు. అదే సూత్రాన్ని కాంగ్రెస్‌ పాటించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారట. 


ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 38 ఎమ్మెల్యేలను గెలిచింది. వీరిలో ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో ఆరేడుగురు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇలా 26 మందిని అంటే 2/3 వంతును కాంగ్రెస్‌లో చేర్చుకొని బీఆర్‌ఎస్‌ ఎల్పీని విలీనం చేయించాలని చూస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.