చాలా అనారోగ్యాలకు మానసిక సమస్యలే కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అసిడిటి, అజీర్తి వంటి గట్ సంబంధిత సమస్యలకు ముఖ్యమైన కారణం కూడా అవేనని పేర్కొంటున్నాయి. అయితే, 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్కుల్లో గుండె పోటు ప్రమాదం మానసిక కారణాలతో మూడు రెట్లు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


యాంక్జైటీ, డిప్రెషన్, నిద్రలేమి, పని ఒత్తిడి కచ్చితంగా బీపీ పెరిగేందుకు కారణమవుతాయి. బీపి పెరిగితే రక్తనాళాల మీద అదనపు ఒత్తిడి తప్పదు. అప్పుడు కచ్చితంగా గుండె ఆరోగ్యం ప్రత్యక్షంగానే ప్రభావానికి లోనవుతుంది.


మానసికంగా రిలాక్స్డ్ గా ఉన్న వారితో పోలిస్తే మానసికంగా ఒత్తిడికి గురవుతున్న వారిలొ గుండెపోటు కు 58 శాతం, స్ట్రోక్ కు 42 శాతం ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని కొత్త అధ్యయన వివరాలు తెలుపుతున్నాయి.


పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డాజార్డర్ తో బాధపడుతున్న వారిలో ఈ ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందట. 6.6 మిలియన్ల జనాభా నుంచి సేకరించిన డేటా అనుసరించి ఈ వివరాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా వయసుతో నిమిత్తం లేకుండా 20 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.


ఆరోగ్యవంతమై జీవన శైలి కలిగి ఉన్నంత మాత్రాన ప్రమాదం నుంచి దూరంగా ఉన్నామని అనుకోకూడదని, ఎవరైనా సరే తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండడం తప్పనిసరి అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ఫ్రొఫెసర్ సూన్ పార్క్ అభిప్రాయపడ్డారు. యువతలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక మానసిక సమస్య ఉంది. అది వారిలో గుండెపోటు లేదా స్ట్రోక్ కు కారణం కావచ్చు.


మానసిక సమస్యలను మేనేజ్ చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి జరిపే పరిశోధనలకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతి నలుగురిలో ఒక్కరు డిప్రెసియోతో బాధపడుతున్నారట. లైఫ్ స్టయిల్ ఆరోగ్యంగా పెట్టుకోవడం తప్పనిసరి. మానసికంగా రిలాక్స్‌డ్‌గా ఉండేందుకు తప్పనిసరిగా వ్యాయామం చెయ్యడం, యోగా, మెడిటేషన్ వంటివి సాధన చెయ్యడం అవసరం. వారంలో కనీసం 4 గంటల పాటు ఈత, జాగింగ్, వాకింగ్ వంటి కార్డియో రకం వ్యాయామాలు అవసరం.


కేవలం వ్యాయామం మాత్రమే కాదు, తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. యువతలో చాలామంది పౌష్టికాహారం మీద పెద్దగా దృష్టి నిలపరు. రుచిగా ఉందనో, అందుబాటులో ఉందనో కనిపించిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచన మానుకోవడం మంచిది. వీలైనంత వరకు ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి.


ఈ  జాగ్రత్తలన్నీంటితో పాటు కనీసం ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, మానసికంగా రిలాక్స్‌డ్‌గా ఉండడం చాలా అవసరం. ఎటువంటి ఒత్తిడి అయినా సరే అది ఎక్కువ కాలం పాటు కొనసాగితే తప్పకుండా అది ఆరోగ్యం మీద ప్రతికూలంగా పనిచేస్తుందని మరచిపోవద్దు. అవసరం అనుకుంటే రిలాక్సింగ్ టెక్నిక్స్ నేర్చుకునేందుకు నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దని ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్నారు.


Also read: హైబీపీతో బాధపడుతున్న వారు అధిక సోడియం ఉండే ఈ కూరగాయలను తినకూడదు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.