అధిక రక్తపోటు లేదా హై బీపీ... ఇది ఒక సాధారణ వ్యాధిలాగే కనిపిస్తుంది. ఇది శాశ్వతంగా నయం కాదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. ఈ సమస్య చిన్నగా కనిపిస్తున్నా శరీరంలోని ప్రధాన అవయవాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గుండె, మెదడు, కిడ్నీలపై ఇది చూపించే ప్రభావం ఎక్కువ. అందుకే అధిక రక్తపోటును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి రావచ్చు. వైద్యులు ఇచ్చిన మందులను వాడడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.


కూరగాయలు ఆరోగ్యకరమైనవే. అయితే వాటిలో రెండు రకాలు ఉన్నాయి. కొన్ని రకాల కూరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. మరికొన్నింటిలో సోడియం తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు సోడియం తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. దీని వల్ల రక్తపోటు పెరగకుండా ఉంటుంది.


పాలకూర 
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది. కాకపోతే సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి హై బీపీ బారిన పడినవారు పాలకూరను తక్కువగా తినాలి, లేదా ఇతర కూరలతో కలిపి తినాలి. దీనివల్ల ఆ కూరను తక్కువగా తినే అవకాశం ఉంటుంది.


మెంతి ఆకులు 
మెంతాకు ఎంత మంచిదో అందరికీ తెలిసింది. కాకపోతే దీనిలో సోడియం కంటెంట్ అధికం. దాని వల్ల హై బీపీ పెరిగే అవకాశం ఉంది.


లెట్యూస్
ఆకుల్లా కనిపించే ఒక రకమైన ఆకుకూర ఇది. ఎక్కువగా సలాడ్లలో వీటిని వాడుతారు. దీనిలో కూడా సోడియం ఎక్కువగానే ఉంటుంది. 


జీడిపప్పులు
నట్స్ లో ముఖ్యమైనవి జీడిపప్పులు. వీటిలో మంచి కొవ్వులు, క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. అయితే రక్తపోటు ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు. అలాగే ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు జీడిపప్పుకు దూరంగా ఉండటం చాలా మంచిది.


కర్బూజా 
పండ్లలో కర్బూజా ఉత్తమమైనది, కాకపోతే దీనిలో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు సమస్యలతో బాధపడే వారు తప్పనిసరిగా ఈ పనులు దూరం పెట్టాలి.


ఊరగాయలు
తెలుగు వారికి ఆవకాయలు ఉంటే చాలు, ఎంత అన్నమైనా తినేస్తారు. కానీ ఊరగాయలు అధిక రక్తపోటు ఉన్నవారు తక్కువగా తినడం మంచిది. ఎందుకంటే దీంట్లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. నిల్వ చేయడం కోసం ఉప్పును అధికంగా వేస్తారు. కాబట్టి వీటిని చాలా మితంగా తినాలి. 


సాస్
ఆధునిక కాలంలో కొత్తగా కనిపెట్టిన ఆహారాలకు జోడి సాస్.  ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు అన్నింటికీ సాస్ కావాలి. కానీ వీటిని తినడం వల్ల సంతృప్త కొవ్వులు పెరిగిపోతాయి. తెలియకుండా సోడియం, చక్కెర కూడా శరీరంలో అధికంగా చేరిపోతాయి.


టమోటో ప్యూరీ
ఇంట్లో చేసుకున్న టమోటా ప్యూరీ మంచిదే. కానీ మార్కెట్లో రెడీమేడ్ గా దొరికే క్యాన్డ్ టమోటో జ్యూస్ ను మాత్రం తాగకూడదు. దీనిలో సోడియం అధికంగా ఉంటుంది. 



Also read: ఇదేమి విచిత్రం, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇబ్బందుల్లో పడ్డాడు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.