వివాహ సమయంలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు చాలా బిజీగా ఉంటారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లతో అందమైన సంఘటనలను అపురూప చిత్రాలుగా మారుస్తారు. అలా ఓ జంటకు ఫోటోలు తీశాడు ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మంచి పేమెంట్ కూడా రావడంతో హ్యాపీగా పెళ్లి ఫోటోలను ఆల్బమ్ గా మార్చి ఇచ్చేశాడు. ఇది జరిగి నాలుగేళ్లు అయింది. ఆ తరువాత అతనికి అసల్ షాక్ తగిలింది. ఇలా ఏ ఫోటో గ్రాఫర్‌కు అనుభవం అయి ఉండదు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందంటే...


2019లో ఓ జంట పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళికి ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ను ఏర్పాటు చేసుకున్నారు. పెళ్లి జరిగిన నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఆ మహిళ తన పెళ్లికి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్‌కు మెసేజ్ పెట్టింది. ‘నేను మీకు గుర్తున్నానో లేదో, 2019లో నా పెళ్ళికి మీరు ఫోటోలు తీశారు’ అని మెసేజ్ చేసింది. అది చదివిన ఫోటోగ్రాఫర్ ‘నాకు గుర్తున్నారు’ అని మెసేజ్ పెట్టారు. దానికి ఆమె ‘ఇప్పుడు నేను విడాకులు తీసుకున్నాను, నా పెళ్లి ఫోటోలు నాకు అవసరం లేదు కాబట్టి నేను మీకు చెల్లించిన మొత్తాన్ని వాపస్ చేయండి’ అని మెసేజ్ పెట్టింది. అది చదివిన ఫోటోగ్రాఫర్‌కు దిమ్మ తిరిగింది. 


పెళ్లైన నాలుగేళ్ల తర్వాత ఆమె విడాకులు తీసుకుని డబ్బులు అడగడం చాలా విచిత్రంగా అనిపించింది. ఆమెతో చాలాసేపు మెసేజ్‌ల రూపంలోనే వాదించాడు ఫోటోగ్రాఫర్. అయినా సరే ఆమె వెనక్కి తగ్గలేదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కనీసం 70% రిఫండ్ చేయాలని కోరింది. ఆమెతో విసిగి పోయిన ఫోటోగ్రాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ మెసేజ్‌లను పోస్ట్ చేశాడు. ఆమె నుంచి విడాకులు తీసుకున్న భర్త కూడా ఆ మెసేజ్‌లు  చదివి షాక్ అయ్యాడు. ‘ఇది చాలా అవమానకరం’ అంటూ మెసేజ్ పెట్టాడు. నెటిజన్లు ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. ఇప్పటికే 3.8 లక్షల వ్యూస్ ట్విట్టర్ పోస్టుకు వచ్చాయి. విడాకులకు కచ్చితంగా ఈమెనే కారణం అయి ఉంటుంది అని కామెంట్ చేసిన వారూ ఉన్నారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన మహిళతో ఎవరు మాత్రం కలిసుండగలరు అంటూ ఎంతో కామెంట్లు పెట్టారు. ఆమె మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరికొందరు ‘ఆ పెళ్లిలో భోజనాలు చేసిన వారిని, ఆ భోజనానికి సరిపడా డబ్బును కట్టమని అడగలేదు’ అంటూ జోకులు వేసుకుంటున్నారు. 




Also read: యువతికి చిన్న మొటిమ వచ్చింది, తర్వాత ప్రాణాంతక క్యాన్సర్‌గా మారింది