ఆడవారిలో అధికంగా వచ్చే క్యాన్సర్... రొమ్ము క్యాన్సర్, కాగా మగవారిలో ఎక్కువ వచ్చే క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్. కానీ చాలా మంది పురుషులకు ఈ క్యాన్సర్ విషయంలో అవగాహన తక్కువ. నిజం చెప్పాలంటే దీన్ని పెద్దగా పట్టించుకోరు కూడా. తమకు ఎందుకు వస్తుందిలే? అనే ధీమా వారిలో కనిపిస్తుంది.  అదే తప్పు. నిశ్శబ్ద విప్లవంలా దేశంలో క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న మగవారి సంఖ్య అధికంగానే ఉంది. కాబట్టి ఆ రోగానికి సంబంధించి పురుషులు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది ముదిరితే ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన పురుషులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికంగా ఆ వయసు దాటిన వారకే వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి ఈ క్యాన్సర్ రావడానికి కారణం అనారోగ్యకరమైన జీవనశైలే. 


లక్షణాలు ఎలా ఉంటాయి?
ప్రొస్టేట్ క్యాన్సర్ లో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి కనిపించగానే వెళ్లి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 
1. హఠాత్తుగా బరువు తగ్గుతారు. 
2. రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రానికి లేవాల్సి వస్తుంది. చాలా మంది ఈ లక్షణాన్ని మధుమేహమేమో అనుకుంటారు కానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ ఏమో అని అనుమానించరు. 
3. మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపిస్తుంది. 
4. మూత్రం పోసేటప్పుడు ఆ వేగంలో మార్పులు కనిపిస్తాయి. లేదా కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. 
5. మూత్ర విసర్జనకు కూడా కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 
6. మెడ భాగం నుంచి కింద వరకు నొప్పిగా అనిపిస్తుంది. దీన్ని కూడా చాలా మంది నిర్లక్ష్యంగా తీసుకుంటారు.


ఎందుకు వస్తుంది?
నిజానికి ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి ప్రత్యేకంగా కారణాల్లేవు. ఒక్కోసారి వయసు పెరగడంతో పాటూ వస్తుంది. వంశపారంపర్యంగా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు రావచ్చు. అలాగే ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఊబకాయం వల్ల కూడా రావచ్చు. 


నాలుగు దశల్లో...
మొదటి దశలోనే ఈ క్యాన్సర్ గుర్తిస్తే చికిత్స చాలా సులువవుతుంది. రెండో దశలో అయితే క్యాన్సర్ ప్రొస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటుంది. అక్కడే థెరపీలు ఇవ్వాల్సి వస్తుంది. ఇక మూడో దశకు చేరుకుంటే ప్రొస్టేట్ గ్రంథిని దాటి కణాజాలాలకు పాకిందని అర్థం. ఇది కాస్త రిస్క్ తో కూడిన స్టేజ్. ఇక నాలుగో దశలో క్యాన్సర్ ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు కూడా పాకి ప్రాణాంతకంగా మారిపోతుంది. 


వృషణాలను తొలగించాల్సి రావచ్చు...
ఒక్కోసారి రెండు వృషణాలను తొలగించాల్సిన అవసరం కూడా పడుతుంది. శరీరంలో టెస్టోస్టెరాన్ పరిమాణాన్ని తగ్గించడానికి ఇలా చేస్తారు. అయితే ఇది నాలుగో దశలో ఉన్న వారికి మాత్రమే చేస్తారు. అందుకే ప్రొస్టేట్ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకుని ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. 


Also read: నెగిటివ్ వార్తలు అధికంగా చదువుతున్నారా? మానసికంగా దెబ్బతినడం ఖాయం


Also read: కుండ కొనండి, ఇంట్లోనే ఇలా కుండ బిర్యానీ చేయండి, ఇదిగో సింపుల్ రెసిపీ