Inflation Tension : దేశ ప్రజలకు ఇప్పుడు ద్రవ్యోల్బణం  పెద్ద సమస్యగా మారిపోయింది.  అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలను ద్రవ్యోల్బణం సూచిస్తోంది.  దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటగదినీ తాకింది. ద్రవ్యోల్బణం ప్రభావం కుటుంబ ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది.   ఒకప్పుడు మూడు నుంచి నాలుగు శాతం ద్రవ్యోల్బణం ఉంటేనే ఆర్థికవేత్తలు గగ్గోలు పెట్టేవారు. ధరలు అదుపు తప్పుతాయని భయపడేవారు. కరోనా తర్వాత ఇప్పుడు ఏకంగా ఏడు శాతం దాటిపోయింది. కరోనా   ఫస్ట్ వేవ్ ముగిసి సెకెండ్ వేవ్ ప్రారంభమవుతున్న తరుణంలో ధరలు విపరీతంగా పెరగడంతో జీవనశైలిపై ప్రభావం చూపింది. వంటనూనెల ధరలు వందశాతం పెరిగాయి. సామాన్యులపై దీని భారం కొన్ని వందల శాతం ఉంది. పాల రేటు కూడా పది నుంచి పన్నెండు శాతం పెరిగింది. టమాట, ఉల్లిపాయల వైపు చూసేందుకే జనం భయపడుతున్నారు.నిత్యావసరాల ధరలు స్థిరంగా ఉండకుండా జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. 


దేశంలోని అన్ని రంగాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం
 
అన్ని రంగాలపై ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది . తొలుత రూపాయి మీద దాని ప్రతాపం చూపడంతో మారకం విలువపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం దాదాపు ఎనభై రూపాయలిస్తే గానీ ఒక డాలర్ రావడం లేదు. దీనితో దిగుమతులకు కేంద్రం అదనపు వ్యయం చేయాల్సి వస్తోంది. అది చమురు ధరలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా అన్ని రంగాలపైనా ద్రవ్యోల్బణం విరుచుకుపడుతుంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు నెల వ్యయం బాగా పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం నగరాల్లో ఉంటున్న జనం నెల వ్యయం సగటున ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు పెరిగింది. దానితో నెలనెల దాచుకునే డబ్బు నుంచి కొంత బయటకు తీసి.. కుటుంబ ఖర్చులకు వెచ్చించాల్సి వస్తోంది.  



 ఇంధన ధరల పెంపుతో మండుతున్న నిత్యావసరాల ధరలు 


ఇంధన ధరల పెరుగుదల అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ఇలా పెంచుతోంది ప్రభుత్వమే.  కరోనా పుణ్యమాని రవాణా రంగం పూర్తిగా దెబ్బతిన్నది. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరుగుతూ పోతుండటం తీవ్ర విఘాతంగా మారింది. ధరలు పెంచిన ప్రతిసారీ అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలనే దీనికి కారణంగా చెబుతున్నారు. క్రూడాయిల్‌ ధరలతో లంకె పెడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రస్తుతం ఆకాశానికి ఎగబాకి లీటరు రూ.110కి అటూ ఇటుగా ఉన్నాయి. మనదేశంలో పెట్రోలు, డీజిల్‌ వాడకం ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక పెట్రో సెస్ కూడా మోయలేని భారమవుతోంది. గ్యాస్ బండ గుదిబండగా మారి.... సామాన్యుల నడ్డి విరుస్తోంది..


ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తోందా ?
  
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందన్న చర్చ సరిగ్గా ఇప్పుడే మొదలైంది. డిసెంబరు నాటికి దేశంలో ఆర్థిక మాంద్యం రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. సామాన్యులపై 12 నుంచి 18 నెలల  కాలంలో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యంలో పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి లెక్కల ప్రకారం దేశంలో 8 శాతం మంది నిరుద్యోగం ఉంది. మాంద్యం వచ్చే పరిస్థితుల్లో అది రెట్టింపు కావచ్చు.  కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కనీసం 12 ఏళ్లు పడుతుందని రిజర్వ్ బ్యాంక్ నివేదిక చెబుతోంది.