IND-W vs SL-W, 3rd ODI:  శ్రీలంకతో రెండో వన్డేలో భారత అమ్మాయిలు ఘన విజయం సాధించారు. మూడు వన్డేల సిరీసును 2-0తో సొంతం చేసుకున్నారు. 256 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంకను 47.3 ఓవర్లకు 216కే కుప్పకూల్చారు. ఛేదనలో చమరీ ఆటపట్టు (44), హాసిని పెరీరా (39), నీలాక్షి డిసిల్వా (48) రాణించారు. రాజేశ్వరీ గైక్వాడ్‌ 3, మేఘన, పూజా వస్త్రాకర్‌ తలో 2 వికెట్లతో ప్రత్యర్థిని పడగొట్టారు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (75) కెప్టెన్‌ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకుంది. పూజా వస్త్రాకర్‌ (56 నాటౌట్‌), షెఫాలీ వర్మ (49) ఆమెకు అండగా నిలిచారు.


నువ్వా నేనా అన్నట్టే!


కఠినమైన పల్లెకెలె పిచ్‌పై టాస్‌ ఓడిన టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసింది. జట్టు స్కోరు 30 వద్దే స్మృతి మంధాన (6) ఔటైంది. యస్తికా భాటియా (30)తో కలిసి షెఫాలీ దుమ్మురేపింది. భారీ బౌండరీలు బాదేసింది. వీరిద్దరూ మూడు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వచ్చిన హర్లీన్‌ డియోల్‌ (1) దీప్తి శర్మ (4) విఫలమయ్యారు. కీలక సమయంలో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ నిలదొక్కుకుంది. రిచా ఘోష్‌ ఔటైనా.. పూజా వస్త్రాకర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం అందించింది. దాంతో 124/6తో నిలిచిన భారత్‌ 221 వరకు మరో వికెట్‌ చేజార్చుకోలేదు.


Also Read: అసలే బట్లర్‌ ఆపై కెప్టెన్‌ అయ్యాడు! హిట్‌మ్యాన్‌ ఆపగలడా?


Also Read: ఇంగ్లాండ్‌తో తొలి టీ20కి ముందు రోహిత్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌!!


ఛేదనలో లంకకూ శుభారంభం దక్కలేదు. 7 పరుగుల వద్దే ఓపెనర్‌ విష్మి (30) ఔటైంది. అయితే చమరీ, హాసిని పెరీరా కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వారిద్దరూ ఔటయ్యాక నీలాక్షి ప్రతిఘటించింది. కీలక సమయంలో రాజేశ్వరీ, మేఘన వికెట్లు పడగొట్టి 39 పరుగుల తేడాతో భారత్‌కు విజయం అందించారు.