కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి ప్రతికూల వార్తల సంఖ్య పెరిగిపోయింది. కొత్త కరోనా వేరియంట్ వచ్చింది, ఇంత మంది చనిపోయారు, అంత మందికి సోకింది... అంటూ అన్ని నెగిటివ్ వార్తలే. ఇక రోడ్డు యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు.... ఇలాంటి నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. వీటినే అధికంగా చదివే వారూ ఉన్నారు. ఇది దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఇలా ప్రతికూల వార్తలను అధికంగా చదవడాన్ని ‘డూమ్ స్క్రోలింగ్’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇదొక మానసిక సమస్యగా మారిపోయింది. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చాలా మంది వార్తా యాప్ లు, వెబ్ సైట్ల మీదే ఆధారపడుతున్నారు. వాటిలో ఎక్కువగా నెగిటివ్ వార్తలే దర్శనమిస్తున్నాయి. ఈ వార్తలు నిత్యం చదవడం వల్ల మానసికంగా, భౌతికంగా కూడా తీవ్ర ప్రభావం పడుతున్నట్టు గుర్తించారు ఆరోగ్యనిపుణులు. ఫోన్ పట్టుకుని వరుసపెట్టి వార్తలు కోసం వెతకడం, వాటిని చదవడం... డూమ్ స్క్రోలింగ్.
ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ప్రతికూల వార్తలు అధికంగా చూడడం వల్ల నాడీ వ్యవస్థ ఒత్తిడి హార్మోన్లను అధికంగా విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని ఇబ్బందికి గురిచేస్తుంది. డూమ్ స్క్రోలింగ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1. నిత్యం అలసటగా అనిపించడం
2. ఆందోళనగా అనిపించడం
3. డిప్రెషన్
4. నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలేమి
5. పొట్టలో సమస్యలు, అజీర్తి, కడుపుబ్బరం
6. ఆకలి లేకపోవడం
ఏం చేయాలి?
1. మొబైల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించండి. మీకు తెలియకుండానే మీరు డూమ్ స్క్రోలింగ్ బారిన పడుతారు.
2. ముఖ్యంగా వార్త యాప్‌లకు సంబంధించి నోటిఫికేషన్లను టర్నాఫ్ చేయండి. నోటిఫికేషన్ కనిపించగానే నొక్కేసే వాళ్లు ఎంతోమంది.
3. స్నేహితులను, బంధువులను కలిసినప్పుడు వార్తల గురించి చర్చించడం మానివేయండి. లేకుంటే మీ మానసిక స్థితి మీకు తెలియకుండా చేజారిపోతుంది.
4. ప్రతి రోజు ఉదయం కనీసం అరగంట ధ్యానం, యోగా వంటివి చేయండి.
5. ఆటలు ఆడడం వల్ల రిలాక్సేషన్ వస్తుంది. ఆటల్లో పడిన మెదడు చెడు విషయాల గురించి ఆలోచించడం మానివేస్తుంది. నిరుత్సాహపరిచే వార్తలు చదవడం మానివేయండి. మీకు ఇష్టమైన పనులు చేయండి. వ్యాయామం చేయండి.
వార్తల్లో కూడా పాజిటివ్ వార్తలు, ఫీల్ గుడ్ వార్తలు చాలా ఉంటాయి. స్పూర్తి నింపే వ్యక్తుల ప్రొఫైళ్లు ఉంటాయి. అలాంటివి ఎంపిక చేసుకుని చదువుకోవాలి.