ఆధునిక జీవితంలో ఒత్తిడి పెరిగిపోతోంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక డిప్రెషన్ బారినపడుతున్న వారు, యాంగ్జయిటీ వంటి సమస్యలతో సతమతమవుతున్నవారు, చివరికి ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నవారు ఎంతో మంది. ఒత్తిడి ఛాయలు కనిపించగానే జాగ్రత్తపడితే తీవ్ర సమస్యలు రావు. ఒత్తిడి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది.సరైన సమయంలో దీనికి చికిత్స చేయకపోతే ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. మీరు రోజూ తినే ఆహారంలో ఈ పదార్ధాలను చేర్చుకుంటే ఒత్తిడిని ప్రాథమిక దశలోనే ఓడించవచ్చు. 


డార్క్ చాక్లెట్
ఒత్తిడిని అధిగమించేందుకు డార్క్ చాక్లెట్ బాగా పనిచేస్తుంది. రోజూ చిన్న ముక్క తినడం వల్ల మంచి మేలు జరుగుతుంది. ఇది మనసుపై రసాయన, భావోద్వేగ ప్రభావాన్ని చూపిస్తుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు  సమృద్ధిగా ఉంటాయి.దీన్ని మితంగా తినడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. 


వెచ్చని పాలు
గోరువెచ్చని పాలు రాత్రి తాగితే చాలా మంచిది. రాత్రి భోజనం ముగించిన అరగంట తరువాత వెచ్చనిప పాలు తాగాలి. ఇది చక్కని నిద్రను ప్రేరేపిస్తుంది. వెచ్చని పాలలో ఉండే కాల్షియం, విటమిన్ డి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. కండరాలను సడలిస్తాయి. దీనివల్ల ఒత్తిడి కలగదు. 


ఫైబరీ ఫుడ్స్
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గుతాయి. ఫైబర్ అధికంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, నట్స్ బాగా తినాలి. బీన్స్, బ్రకోలి, బెర్రీలు, అవకాడోలు, పాప్ కార్న్, ఆపిల్స్, ఎండు ద్రాక్షలు, పప్పు ధాన్యాలు అధికంగా తినాలి.


నట్స్
జీడిపప్పులు, బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి గింజల్లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని మితంగా తినడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తాయి. అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటివి రోజూ అర గుప్పెడు తిన్నా చాలు. 


ప్రాసెస్ చేయని ధాన్యాలు
సెరోటోనిన్ (ఒత్తిడిని తగ్గించే బూస్టింగ్-మూడ్ హార్మోన్) స్థాయిలను పెంచడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.  ప్రాసెస్ చేయని ధాన్యాలు తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి రక్తంలో చక్కెర ఒకేసారి అధికంగా విడుదుల అవదు. 


Also read: బెల్లం ఎన్ని రకాలో తెలుసా? వాటిలో ఏది మంచిదంటే

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.