చెరకు రసంతో తయారయ్యే బెల్లం అని చాలా మందికి తెలుసు. కానీ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ప్రాచీన వేదయుగ నుంచి బెల్లం వాడుకలో ఉంది. ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాతన గ్రంథమైన చరక సంహితంలో కూడా బెల్లం వాడకం గురించిన ప్రస్తావన ఉంది. బెల్లం అంటే ఒక తీపిపదార్థంగానే చాలా మంది చూస్తారు కానీ దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆసియా దేశాలలో దీని వాడకం చాలా ఎక్కువ. ప్రపంచంలోని బెల్లం ఉత్పత్తిలో 55 శాతం మన దేశంలోనే జరుగుతుంది. కానీ ఇందులో మూడు రకాలు బెల్లాలు ఉన్నాయి. ఒకటి చెరకుతో తయారవుతుంది, మిగతా రెండింటికీ చెరకు రసం అవసరం లేదు.
చెరకు బెల్లం
అత్యంత సాధారణ రకం చెరకు రసంతో తయారయ్యే బెల్లం. చెరకు రసాన్ని ఉడకబెట్టడం ద్వారా బెల్లాన్ని తయారుచేస్తారు. అలాగే పంచదారను కూడా చెరకు రసంతోనే తయారు చేస్తారు. మార్కెట్లో అధికంగా దొరికే బెల్లం రకం ఇదే. దీనిలో ఇనుము శాతం అధికంగా ఉంటుంది.
తాటి బెల్లం
దీన్ని ఖజూర్ గుర్ అని కూడా పిలుస్తారు. దీని రుచి చాక్లెట్ రుచిలా ఉంటుంది. దీనిలో కూడా ఖనిజాలు అధికం. ఖర్జూర రసాన్ని తీసి దానితో ఖర్జూర బెల్లం తయారుచేస్తారు. కోల్‌కతా ప్రాంతంలో ఎక్కువగా ఈ బెల్లాన్ని వాడతారు. ఇతర రకాల బెల్లాలతో పోలిస్తే దీనిలో పోషకాలు ఎక్కువే అని చెప్పాలి.
కొబ్బరి బెల్లం
కొబ్బరి నుంచి తీసిన పాలతో దీన్ని తయారుచేస్తారు. దీనిలో మెగ్నీషియం, ఐరన్ అధికంగా ఉంటాయి. దీనిలో కృత్రిమ పదార్థాలు ఏమీ కలవవు. ఈ బెల్లాన్ని పిరమిడ్ ఆకారంలో తయారుచేసి అమ్ముతారు. అందుకే దీన్ని ‘పిరమిడ్ గుడ్’ అని పిలుస్తారు. దీన్ని అధికంగా కారంగా ఎక్కువైన కూరల్లో ఆ కారాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ఏది ఉత్తమమైనది?
మూడు రకాల బెల్లం రకాలతో పోలిస్తే కొబ్బరి బెల్లం లేదా తాటి బెల్లం మంచిదని చెప్పవచ్చు. అన్నింట్లోనూ ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే కొబ్బరి, తాటి బెల్లాల్లో ఫ్రక్జోజ్, గ్లూకోజ్ తక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తాటి బెల్లం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి ఉన్నందున అత్యంత ఆరోగ్యకరమైనదిగా చెబుతారు. అంతేకాదు ఇది అనేక పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరగవుతుంది. అందుకే వీలైనంత వరకు తాటిబెల్లాన్ని ఉపయోగిస్తే చాలా మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
Also read: ఇలాంటి పాత్రల్లో వంట చేస్తే ఎంత డేంజరో తెలుసా? ఈ రోగాలన్నీ రావడానికి సిద్ధం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.