Farm House Case : ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతోంది. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ కూడా పూర్తయింది. రెండు రోజుల్లో తెలుసుకోగలిగినంత సమాచారం తెలుసుకున్నారు. కానీై వాట్ నెక్ట్స్ అన్నది మాత్రం ఇప్పటికీ అస్పష్టతగానే ఉంది. కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. 23 మంది ముఠా ఉందని అందరికీ తెలిసింది. వీళ్లెవరు ? ఎక్కడెక్కడ ఉంటారు ? వారందర్నీ ఎలా పట్టుకొస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసులో ముందుగానే విడుదల చేసిన సాక్ష్యాలు ఎంత వరకూ చెల్లుబాటనే సందేహం ఉండనే ఉంది. ఈ క్రమంలో అన్నీ వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆ నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రారంభమయింది.
నలుగురు ఎమ్మెల్యేలను ప్రశ్నించని పోలీసులు !
ఫామ్‌హౌస్ డీల్ బయటపడినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందే తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే ట్రాప్ చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి.. ఆడియో, వీడియోల్లో ఉన్న మాటల మర్మాన్ని తెలుసుకోవడానికి పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు ప్రశ్నించడం లేదనేది ఎక్కువగా విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. ఆ నలుగురు ఫిర్యాదు దారులైనా సరే వారి దగ్గర్నుంచి వాంగ్మూలం తీుకోవాలి కదా అని అడుగుతున్నారు. కానీ పోలీసులు మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. నిందితులను రెండు రోజుల కస్టడీకి తీసుకుని వాయిస్ శాంపిల్స్ తీసుకుని.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి మళ్లీ రిమాండ్‌కు పంపేశారు.
కేసీఆర్‌నూ సాక్షిగా విచారించాంటున్న బీజేపీ !
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో సీఎం కేసీఆర్ను సాక్షిగా విచారించాలన్న డిమాండ్ బీజేపీ వైపు నుంచి వస్తోంది. నిందితులు, ఫిర్యాదుదారులు, కోర్టులు చెప్పాల్సింది కూడా కేసీఆరే చెప్తున్నారని బీజేపీ అంటోంది. నిష్పక్షపాతంగా విచారణ జరపాలనే తాము కోర్టుకు వెళ్లామని ... సిట్ విచారణతో ఒరిగేదేమిలేదని..సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బండి సంజయ్ అంటున్నారు. ఈ కేసులో బీజేపీ ఉందని కేసీఆరే చెప్పారని.. నలుగురు ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసలు మొత్తం ముఠాల గురించి.. కోట్ల లావాదేవీల గురించి బయట పెట్టింది కేసీఆర్ కాబట్టి... ఆయనను పోలీసులు సాక్షిగా విచారించాలని బండి సంజయ్ డిమాండ్ చే్సతున్నారు. ఎక్కువ మందికి వస్తున్న సందేహం కూడా అదే. దొరికిన ముగ్గురు తప్ప.. డీల్‌లో పాలు పంచుకున్న వారు.. ఆధారాలు బయట పెట్టిన వారి దగ్గర పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఎందుకు నమోదు చేయడం లేదన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.
ఫామ్ హౌస్ డీల్స్ కేసుకు తార్కిక ముగింపు వస్తుందా ?
ఫామ్ హౌస్ కేసును నిశితంగా పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్ విడుదల చేసిన ఆడియో, వీడియోలు తప్ప.. ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఆ ముగ్గురు నిందితులకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు రెండు మూడు ఉన్నాయి. ఆ మేరకు కేసు పెట్టవచ్చు కానీ.. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పెట్టలేని.. న్యాయవర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ఉంది.. ఇంత మొత్తం దొరికిందని పోలీసులు ప్రకటించలేదు. ఇప్పటి వరకూ చెప్పలేదు కాబట్టి ఇక ముందు చెప్పరు. అంటే ఇక్కడ మనీ లావాదేవీలకు ఆధారం లేదు. అలాంటప్పుడు జరిగాయని నిరూపించడం చాలా కష్టం. ఇక ఆధార్, పాన్ కార్డుల లావాదేవీలు.. గురించి తెలుసుకోవాలంటే.. కేంద్రం వల్లే అవుతుంది. అలాంటి సమాచారం అందదు. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఠా సభ్యులను పట్టుకోవడానికి వెళ్తే సహకారం కూడా అందదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాలే అక్కడ ఉంటాయి.
మొత్తంగా ఎలా చూసినా.. ఫామ్ హౌస్ కేసులో పస లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే సిట్ చీఫ్‌గా చార్జ్ తీసుకుంది.. సిన్సియర్ ఆఫీసర్‌గా పేరున్న నీవీ ఆనంద్. ఆయనేమైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.