Vizag Modi Meeting :  విశాఖలో శనివారం ఉదయం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగసభలో వేదికపై ప్రధాని మోదీ కాకుండా మరో ఎనిమిది మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో ఎక్కువగా బీజేపీ నేతలే ఉంటున్నారు. వీరిలో ప్రధాని మోదీ కాకుండా.. ప్రోటోకాల్ ప్రకారం సీఎం జగన్, స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు మాత్రమే వైసీపీ నేతలకు అవకాశం దక్కింది. గవర్నర్ బిశ్వభూషణ్‌తో పాటు నెల్లూరు బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎంపీ జీవీల్ నరసింహారావు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణువ్, ఎంపీ సీఎం రమేష్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌కు అవకాశం లభించింది. వేదికపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నలభై నిమిషాలు ప్రసంగించనుండగా.. ముఖ్యమత్రి జగన్‌కు ఏడు నిమిషాలు కేటాయించారు. 


సభా వేదికపై ఎవరు ఉండాలో నిర్ణయం  కేంద్ర సిబ్బందిదే !


సాధారణంగా ప్రధానమంత్రి పాల్గొనే బహిరంగసభ అంటే పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ పాటిస్తారు. భద్రతా ఏర్పాట్లు చేస్తారు. వేదికపై పరిమిత సంఖ్యలోనే ఆశీనులయ్యే అవకాశం కల్పిస్తారు. ప్రధాని భద్రతా సిబ్బంది.. ఆయన రాజకీయ వ్యవహారాల సిబ్బంది మొత్తం సభ ఎంత సేపు జరగాలి.. మోదీ సహా మిగిలిన వారు ఎంత సేపు ప్రసంగించాలన్న అన్ని విషయాలను పక్కాగా ఫాలో అవుతారు. ఈ ప్రకారమే.. వేదికపై ప్రోటోకాల్ ప్రకారం తప్ప.. ఇతర విధాలుగా వైఎస్ఆర్‌సీపీ నేతలకు అవకాశం దక్కలేదని తెలుస్తోంది. నిజానికి రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అని చెప్పిన ప్రభుత్వం.. ప్రజాధనంతో బహిరంగసభ ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి సభా నిర్వహణ చూసుకున్నారు. 


జీవీఎల్‌కు చోటు.. విజయసాయికి నో చాన్స్ 


 విశాఖపట్నం స్థానిక ఎంపిగా ఆయన చెలామణి అవుతున్నారు. అధికారులతో సమీక్షలు లాంటివి చేస్తూంటారు. అయినప్పటికీ ఆయనకు వేదికపై చోటు లభించలేదని తెలుస్తోంది. మోదీ సభలో వేదికపై ఉండే తొమ్మిది మందిలో ఒకరైన జీవీఎల్ నరసింహారావు ఇటీవలి కాలంలో విశాఖలో ఎక్కువగా కనిపిస్తున్నారు., వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ.. ఏపీ కోటాలో కాదు. ఆయన యూపీ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. అయినప్పటికీ విశాఖలో వేదికపై చోటు లబించింది. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం అవకాశం లభించలేదు. 


సభ మొత్తం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ 


మోదీ బహిరంగసభను బీజేపీ కన్నా వైఎస్ఆర్‌సీపీనే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున జన సమీకరణకు సన్నాహాలు చేసుకుంది. సాధారణంగా తమ పార్టీ అధినేతతో బహిరంగసభ పెట్టుకుంటే ఏ పార్టీ అయినా ఇలా జన సమీకరణ చేస్తుంది. కానీ మోదీ కోసం వైసీపీ ఇంతలా కష్టపడుతోంది. మూడు లక్షల మందితో సభ నిర్వహిస్తున్నామని విజయసాయిరెడ్డి పదే పదే చెప్పారు. తమ పార్టీ నేతలకు జన సమీకరణ టార్గెట్లు పెట్టారు. అయితే వేదికపై అందరూ బీజేపీ నేతలు ఉంటూండటంతో వైసీపీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందన్న ఆవేదన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.