Rivaba Jadeja:  టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీజీపీ తరఫున ఆమె పోటీలో ఉన్నారు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ఉంది. జామ్ నగర్ నార్త్ సీటును ఆమెకు కేటాయించారు. 


రవీంద్ర జడేజా 2016లో రివాబాను పెళ్లి చేసుకున్నారు. 2019 లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జామ్ నగర్ జిల్లాలో ఆమె చాాలా గ్రామాలను సందర్శించారు. అలాగే అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరించారు. ఆ ప్రాంతంలో ఆమెకు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఆమెకు అసెంబ్లీ సీటును కేటాయించింది.


ఎవరీ రివాబా?


రివాబా జడేజా స్వస్థలం రాజ్‌కోట్. ఆమె తండ్రి నగరంలో ప్రసిద్ధ వ్యాపారవేత్త. రివాబా రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నారు. రివాబా చాలా మెరిట్ స్టూడెంట్. రివాబా జడేజా ఎక్కువ సమయం రాజ్‌కోట్ ఇంకా జామ్‌నగర్‌లోనే ఉంటారు. ఇక్కడ ఆమె 'జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్' అనే రెస్టారెంట్‌ను కూడా నడుపుతున్నారు. 32 ఏళ్ల రివాబా 2019 నుంచి బీజీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. కర్ణిసేన నాయకురాలు కూడా అయిన రివాబా.. ప్రముఖ రాజకీయనేత హరిసింగ్ సోలంకికి దగ్గరి బంధువు. 


సామాజిక సేవా కార్యక్రమాలు


రివాబా శ్రీ మాతృశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ముఖ్యంగా బాలికల సంక్షేమం, విద్యతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేళ్లలో ఆమె జామ్ నగర్ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించారు. 


జడేజాకు వింత తలనొప్పి


రవీంద్ర జడేజాకు ఇప్పుడు వింత తలనొప్పి మొదలైంది. ఎందుకంటే జడేజా భార్య రివాబా పోటీచేస్తున్న స్థానానికి.. జడేజా అక్క నైనా కూడా పోటీపడుతున్నారు. అయితే ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. రివాబా బీజీపీ అయితే నైనా కాంగ్రెస్. ఇప్పుడు జడేజా తన భార్యకు మద్దతిస్తాడా లేక అక్క తరఫున ప్రచారం చేస్తాడో చూడాలి. 


గాయంతో జట్టుకు దూరం


మోకాలి గాయంతో ప్రపంచకప్ జట్టుకు దూరమై శస్త్రచికిత్స చేయించుకున్న జడేజా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆసియా కప్ మ్యాచుల సందర్భంగా జడేజా గాయపడ్డాడు. త్వరలో జరగబోయే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.