Farmhouse Case Updates :  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ ముగిసింది. వారిని  ఏసీబి కోర్టు లో  పోలీసులు హాజరు పరిచారు.  వీరికి కోర్టు ఇరవై ఐదో తేదీ వరకూ రిమాండ్ విధించింది. వెంటనే  చంచల్ గూడా జైలు కు తరలించారు. అంతకు ముందు కోర్టులో విచారణ సందర్భంగా తమను దూషించారని నిందితుడు నందకుమార్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. పోలీసుల కస్టడీ లో అడిషనల్ డీసీపీ నర్సింహా రెడ్డి ఇష్టం వచ్చిన పదజాలం తో బూతులు మాట్లాడరని ఫిర్యాదు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు.  


విచారణలో ఏసీపీ తిట్టారని న్యాయమూర్తికి నిందితుల ఫిర్యాదు


మరో వైపు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్ట్ లో  వాదనలు ముగిశాయి. బెయిల్ తీర్పు సోమవారానికి వాయిదా వేశారు.  ఈ కేసు ఏసీబీ కోర్ట్ పరిధిలోకి రాదని  పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు.  ఫిర్యాదు దారుడు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని పిటిషనర్ తెలిపారు. ఆయన అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదని.. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై గెలిచారని.,.  టీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఫిర్యాదు  చేయడం చట్ట ప్రకారం చెల్లదన్నారు. అందుకే ఈ కేసు కూడా  చెల్లదని, బెయిల్ మంజూరు చేయాలని కోరిన పిటిషనర్  తరపు న్యాయవాదులు కోరారు. సోమవారం తీర్పు వెల్లడయ్యే అవకాశం ఉంది. 


వాయిస్ శాంపిల్స్ తీసుకున్న  పోలీసులు 


రెండో రోజు కస్టడీలో  భాగంగా నిందితుల వాయిస్‭ను రికార్డింగ్ చేశారు.  నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు చేయనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడిన ఆడియో, వీడియోల్లోని వాయిస్‭ను అధికారులు పోల్చి చూడనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో FSL నివేదిక కీలకం కానుంది. మరోవైపు శుక్రవారంతో నిందితుల కస్టడీ ముగియనుంది. నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను గురువారం ఏడు గంటల పాటు సుదీర్ఘంగా  విచారించారు.  ఈ కేసులో ఫాంహౌజ్‌లో రికార్డయిన వీడియో ఫుటేజీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఫుటేజీ ఒరిజినలా కాదా? ఆడియో, వీడియో రికార్డుల విశ్లేషణ కోసం ల్యాబ్‌లో నిందితుల వాయిస్‌ రికార్డు చేయనున్నారు. ఈ ఎఫ్ఎస్ఎల్ పరీక్షలో నిందితుల వారి వాయిస్ పరిశీలనే కీలకం కానుంది.


మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం 


అంతేకాకుండా, ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు  కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో రామచంద్రభారతి ఇచ్చే వాంగ్మూలం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక కీలకం కానున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుల వెనుక ఎవరున్నారనే అంశంపైనా సిట్‌ విచారణ చేపడుతోంది. నిందితుల కాల్‌ డేటా, సెల్‌ఫోన్‌లో వీడియోల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఆధారాలన్నీ డిజిటల్‌ డేటాకు సంబంధించినవి కావడంతో.. ఫోరెన్సిక్‌ నివేదిక అత్యంత కీలకమైనవని పోలీసులు చెబుతున్నారు.  అందుకే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.