చిరచిరలాడుతున్న ఎండ, ఒకటే ఉక్కపోత, స్నానం చేసిన పది నిమిషాల్లో తాజాదనం హుష్ కాకి. ఇలాంటి ఈ వాతావరణంలో రెండు సార్లేమిటి ఎన్ని సార్లు స్నానం చేసినా తనివి తీరడం లేదు. చాలా మందికి వేసవిలో రెండు సార్లు స్నానం చేసే అలవాటుంటుంది. కొందరైతే రాత్రి పడుకునేందుకు కాస్త ముందు స్నానం చేసి ఇక పక్కమీద వాలుతుంటారు. దుమ్ముతో కూడిన వాతావరణంలో పనిచేసే వారికైతే రెండోపూట స్నానం తప్పకపోవచ్చు కూడా. రాత్రి పూట స్నానం వల్ల నిజంగా లాభాలున్నాయా? ఒకసారి చూద్దాం.



  • వేసవిలో దుమ్ము, ఎండ వల్ల చర్మం కాస్త నిర్జీవంగా మారుతుంది. దీనికి తేమ చాలా అవసరం. పొలాల వంటి ఓపెన్ స్థలాల్లో పనిచేసే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రాత్రి స్నానం వల్ల మురికి వదలి శరీరం శుభ్రపడుతుంది. శరీరం తేలిక పడిన భావన కలిగి అలసట తీరినట్టు అనిపిస్తుంది.

  • రోజూ దుమ్ము, చెమట వల్ల శరీరం మురికిగా మారుతుంది. అంతే కాదు మురికి వల్ల అపరిశుభ్రమైన భావన కలిగి మరింత అలసటగా, భారంగా అనిపిస్తుంది. అటువంటపుడు రాత్రి నిద్ర పట్టడం కాస్త కష్టమే. ఇలా మధ్యాహ్నాలు ఎక్కువ కష్ట పడేవారు, ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా రాత్రి స్నానం చేసిన తర్వాతే నిద్ర పోవడం మంచిది. వేసవిలో రాత్రి స్నానం వల్ల అలసట తొలగి మంచి నిద్ర వస్తుంది.

  • రాత్రిపూట స్నానం శరీరంలో నిరోధక శక్తి కూడా పెంచుతుందని చాలా అధ్యయనాలు రుజువులు చూపాయి. నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నివారించవచ్చు. వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల శరీరం మీద మురికి కూడా ఎక్కువగా చేరుతుంది. ఎక్కువ సమయం పాటు మురికి, దుమ్ము చర్మం మీద అలాగే ఉంటే అది చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక రాత్రిపూట స్నానం చెయ్యడం వల్ల మురికి వదిలిపోతుంది. అందువల్ల చర్మ ఆరోగ్యం కూడా సంరక్షించబడుతుంది.


నష్టాలూ ఉన్నాయట!


తాజాగా అనిపించడం, హాయిగా ఉండడం, త్వరగా నిద్ర పట్టడం, మురికి వదిలి పోవడం వంటివన్నీ రాత్రి స్నానంతో లాభాలయితే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో కూడా తెలుసుకోవాలి మరి.



  • ఆరోగ్యం సరిగా లేని వారు అనారోగ్యంతో ఉన్న వారు రాత్రి స్నానం చెయ్యకూడదని సూచిస్తున్నారు. రాత్రి స్నానం చెయ్యాలనుకునే వారు కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు గుర్తుపెట్టుకోవాలి.

  • రాత్రి పూట చన్నీటి స్నానం చెయ్యకపోవడమే మంచిది. కాస్త గోరు వెచ్చని నీటిని రాత్రి స్నానానికి వాడాలి

  • మరీ ఆలస్యంగా స్నానం చెయ్యొద్దు. నిద్ర పట్టేందుకు సమయం పడుతుంది. రాత్రి నిద్ర ఆలస్యం అవుతే పొద్దున్నే నిద్ర లేచేందుకు ఇబ్బందిగా ఉంటుంది.

  • రాత్రి స్నానం చెయ్యాలని అనుకుంటే స్నానం చేసిన తర్వాతే భోంచెయ్యాలి. భోజనం తర్వాత స్నానం చెయ్యడం మంచిది కాదు.

  • బయటి నుంచి వచ్చాక వెంటనే స్నానానికి వెళ్లడం మంచిది కాదు. కాస్త కుదుట పడి శరీర ఉష్ణోగ్రతలు ఇంటి వాతావరణానికి సర్దుకున్న తర్వాత స్నానం చెయ్యడం మంచిది.

  • రాత్రి తలస్నానం చెయ్యాలనుకుంటే స్నానానికి ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా ముగించాలి.


 Also read : ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.