AP Minister Gudivada Amarnath: కేంద్రంలో బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో అమిత్ షా, జేపీ నడ్డాలు సభలు నిర్వహించారు. అయితే విశాఖ, శ్రీకాళహస్తిలో జరిగిన సభలతో బీజేపీ కంటే ప్రతిపక్ష టీడీపీలో సంబరాలు ఎక్కువ జరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని టీడీపీ పార్టీ నాయకులు ఇప్పుడు సంబర పడిపోతున్నారు. రాష్ట్రంలో ఏదో అవినీతి జరుగుతోందని.. వైజాగ్ లో విద్రోహ శక్తులు ఉన్నాయన్న బీజేపీ నేతల మాటలను ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు వైజాగ్ కి మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తే కనీసం వారి కోసం ఒక్క విషయాన్ని సైతం ప్రస్తావించ లేదన్నారు.
ఏపీ ప్రజల సెంటిమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజల సెంటిమెంట్. దాని కంటే ప్రధాన అంశం ఏముంటుందని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 26 వేల మంది రైతులు భూములు ఇచ్చి 32 మంది వ్యక్తులు బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ నతేలు ఎందుకు మాట్లాడరు. ప్రభుత్వాన్ని విమర్శించక పోతే జనం పట్టించుకోరని అమిత్ షా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది వైజాగ్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజల అవసరాలు సీఎం జగన్ వివరించారు. బీజేపీతో వైఎస్సార్ సీపీకి మంచి రిలేషన్ ఉందన్న ప్రచారం జరిగింది. కానీ కేంద్రంతో రాష్త్రం సమన్వయంతో పనిచేయాలన్న ఉద్దేశ్యంతోనే సీఎం జగన్ కేంద్రాన్ని గౌరవిస్తున్నారని మంత్రి అన్నారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2750 ఇస్తే అందులో కేంద్రం ఇచ్చే మొత్తం 250.. కేంద్రం 90 లక్షల మందికి ఇస్తే రాష్ట్రం కోటి యాభై లక్షల మందికి ఇస్తోందని గుర్తుచేశారు. కేంద్రానికి పన్ను కడుతున్నందునే రాష్త్రం వాటా కేంద్రం ఇస్తోంది. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపికి ఇస్తోందని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న మేరకే కేంద్రం విద్యా సంస్థలను ఇచ్చింది. అంతకంటే ఏమీ ఇవ్వలేదు. ఇంకా విభజన హామీలు నెరవేర్చని ఎన్నో అంశాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ ప్రస్తావించారు.
ఏపీలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి నాలుగేళ్లలో 4 వేలు కోట్లు ఆదాయం వచ్చింది. మరి టిడిపి హయాంలో ఇసుక తవ్వలేదా ? ఆ డబ్బు ఎక్కడుకి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది, టిడిపి అవినీతికి బీజేపీ సమాధానం చెప్పదా అని ప్రశ్నించారు. అమిత్ షా మీటింగ్ వేదిక పై ఉన్నది ఎవరు... సీఎం రమేష్, పురంధేశ్వరి, సుజనా చౌదరి. వీళ్లా బీజేపీ నేతలు అన్నారు. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేసినప్పుడు కేంద్రం నుంచి వచ్చిన డబ్బు ఏమైందో చెప్పాలని బీజేపీ జాతీయ నాయకత్వాన్ని అడిగారు. 2 లక్షల 20 వేల కోట్లు నేరుగా వైయస్సార్ సీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చింది. అమరావతి పెద్ద స్కాం అని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు అమరావతి గురించి ఎలా మాట్లాడుతారు అన్నారు.
టీబీజేపీ నేతల మాటలు నమ్మితే బీజేపీ అధిష్టానం మోసపోయినట్టేనని, అమిత్ షా చుట్టూ ఉన్నది టీబీజేపీ నేతలే అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ జోకర్ అని ఆయన మాటలకు సమాధానం ఎవరు చెప్తారని వ్యాఖ్యానించారు. అందరూ ఏకమైనా ప్రజా బలం సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. రాష్ట్ర ప్రజల అవసరం కోసం కేంద్రం తో వైయస్సార్ సీపీ సయోధ్య కొనసాగించింది. కేంద్రం ఇచ్చిన సొమ్ము రాష్ట్రం దుర్వినియోగం చేస్తే అప్పుడు అడగాలన్నారు. కానీ ఏదో ఎన్నికలు వస్తున్నాయని బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో అధిక శాతం మందుల పరిశోధనలు ఏపీలో జరుగుతున్నాయని తెలిపారు.