KCR Speech in Gadwal: గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ కాల్వ‌ను మ‌న‌కు కాకుండా చేసి గ‌ద్ద‌ల్లా త‌న్నుకుపోతే ఉద్య‌మంలో మొట్ట‌మొద‌టి పాద‌యాత్ర తానే చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబకి దండం పెట్టి గ‌ద్వాల వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టానని అన్నారు. కేసీఆర్ క‌న్నా దొడ్డుగా, ఎత్తుగా ఉన్నోళ్లు ఈ జిల్లా నుంచి మంత్రులు అయ్యారని, వారి కాలంలో ఏమీ జరగలేదని అన్నారు. గ‌ద్వాల‌లో ఉన్న‌వారు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయించ‌లేదని అన్నారు. జోగులాంబ గ‌ద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ‌వారం సాయంత్రం ప్రారంభించారు. మొద‌ట తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. గ‌ద్వాల జిల్లా కేంద్రంలో నూత‌నంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం ఉద్యోగుల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.


గద్వాల జిల్లా అభివృద్ధి కోసం జిల్లాలో ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు, ప్రతి మండలానికి రూ.15 లక్షలు, గద్వాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగతా మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. 


‘‘ధరణిని తీసేసి బంగాళాఖాతంలో ఏస్తే ఏమైతది? ఆ ధరణి వల్లే నేను హైదరాబాద్ లో వేసే రైతు బంధు డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నయ్. రైతు చనిపోతే రూ.5 లక్షలు మీకు వస్తున్నయ్. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్, 5 నిమిషాల్లో పట్టా అయిపోతుంది. మూడేళ్లు నేను కష్టపడి ఇంత మంచి ధరణి తయారు చేస్తే కాంగ్రెస్ పార్టీ వారు బంగాళాఖాతంలో వేసేస్తరట. నేను ఎక్కడ అడిగినా ధరణి ఉండాలనే ప్రజలు చెప్తున్నరు. ధరణి తీసేస్తమన్న కాంగ్రెస్ పార్టీకి మీరే బుద్ధి చెప్పాలి.’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.


24 లక్షల ఎకరాలకు సాగునీరు


తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అనేక చోట్ల అలంపూర్, గ‌ద్వాల్, న‌డిగ‌డ్డ‌లో ప‌ర్య‌టించానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నాడు హృద‌య‌విదారక దృశ్యాలు క‌న‌బ‌డ్డాయని అన్నారు. ప్రస్తుతం నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుంద‌ని కేసీఆర్ తెలిపారు. గ‌ట్టు ఎత్తిపోతలకు పునాదిరాయి వేసుకున్నామని అన్నారు. ఆ ప‌నులు కూడా త్వ‌ర‌లోనే పూర్త‌వుతాయ‌ని చెప్పారు. ‘‘పాత పాల‌మూరు జిల్లా ఐదు జిల్లాలుగా మారింది. ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయి. క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల‌, నెట్టెంపాడు, కోయిల్‌సాగ‌ర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగు నీళ్లు ఇచ్చుకుంటున్నాం. ఫ్రీ క‌రెంటు అందిస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం’’ 


14 రోజుల‌కు ఒక‌నాడు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో నీళ్లు దొరికేవి. ఇవాళ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా నీళ్లు అందిస్తున్నాం. దేశంలో ఎక్క‌డా ఇలాంటి ప‌థ‌కం లేదు. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, అమ్మ ఒడి వంటి కార్య‌క్ర‌మాలు చేసుకున్నాం. ఇవాళ క‌ర్నూల్, రాయిచూర్ నుంచి మ‌న వ‌ద్ద‌కు వ‌ల‌స వ‌స్తున్నారు. ఎందుకంటే పాల‌మూరు జిల్లాలో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంది. తెలంగాణ ఏర్ప‌డితే క‌రెంటు రాదని మాట్లాడారు. తుంగ‌భ‌ద్ర బ్రిడ్జి దాటితే 24 గంట‌ల క‌రెంటు లేదు’’ అని కేసీఆర్ మాట్లాడారు.