TSPSC Group 1 Exam: తెలంగాణలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా ఓ అభ్యర్థికి హాల్‌ టికెట్ జారీ చేశారని ప్రచారం జరిగింది. ఈ విషయంపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) స్పందించి వివరణ ఇచ్చింది. దరఖాస్తు చేయకుండానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ జారీ చేయడకం అనేది నిజం కాదని, ఆ వార్తలను కమిషన్ అధికారులు ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నిజామాబాద్‌ కు చెందిన అభ్యర్థి జక్కుల సుచిత్ర గతేడాది గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేశారని, గత అక్టోబర్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు సైతం ఆమె హాజరయ్యారని టీఎస్ పీఎస్సీ స్పష్టం చేసింది. అయితే గ్రూప్‌-3, గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే గ్రూప్‌-1 కు సైతం హాల్‌ టికెట్‌ జారీ చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని, ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని అధికారులు సూచించారు.


994 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న మొత్తం 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన పరీక్షకు 6 లక్షల మంది (79.15 శాతం) అభ్యర్థులు హాజరు కాగా, తాజాగా జరిగిన ప్రిలిమ్స్ కు దాదాపు 50 వేలకు పైగా అభ్యర్థులు దూరంగా ఉన్నారు.


అప్లై చేయకుండానే గ్రూప్ 1 హాల్ టికెట్..
అప్లై చేయకపోయినా ఓ అభ్యర్థికి టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 హాల్ టికెట్ జారీ చేసింది. అయితే ఈ విషయం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన సుచిత్ర అనే యువతికి టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ జారీ చేసింది. అయితే తాను గ్రూప్ 1కు అప్లై చేయలేదని, కేవలం గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసినట్లు తెలిపారు. కానీ తనకు కూడా హాల్ టికెట్ రావడం గమనార్హం. హాట్ టికెట్ వచ్చినందుకు సంతోషించినా, ఎగ్జామ్ సెంటర్ కు వెళితే తనకు ఓఎంఆర్ కేటాయించారో లేదోనని తన కూతురు ఎగ్జామ్ రాయలేదని ఆమె తండ్రి శ్రీధర్ చెబుతున్నారు. తాను అప్లై చేయకపోయినా, హాల్ టికెట్ జారీ చేశారోనని సుచిత్ర కొంచె ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఉద్యోగ పరీక్షలు పకడ్బంధీగా నిర్వహిస్తున్నామని చెప్పే టీఎస్ పీఎస్సీ వరుస తప్పిదాలు చేస్తుందని విమర్శలు మళ్లీ మొదలయ్యాయి.


సిద్దిపేటలో అభ్యర్థి అరెస్ట్..
ఇదివరకే గ్రూప్ 1 తో పాటు పలు ఉద్యోగ నియామకాల పరీక్షలు పేపర్ లీకేజీల కారణంగా రద్దయ్యాయి. కొన్ని ఎగ్జామ్స్ నిర్వహణకు ముందే వాయిదా వేసింది టీఎస్ పీఎస్సీ. కానీ, సిద్దిపేటలో పరీక్ష ప్రారంభానికి ముందే కేంద్రం నుంచి బయటకు వచ్చిన నిర్వాకానికి ప్రశాంత్ అనే అభ్యర్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఓఎంఆర్ షీట్‌లో హాల్‌ టికెట్ నంబర్ తప్పుగా రాసిన అభ్యర్థి.. పరీక్ష మంచిగా రాసినా వృథా అని భావించి బయటకు వచ్చేశాడు. పరీక్ష కేంద్రం బయటకు వచ్చిన కొంత సమయానికే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్‌పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశారు.