హిమాని పుట్టి పెరిగిందంతా ఆగ్రాలోనే. తన ప్రపంచమంతా కుటుంబమే. తండ్రి విజయ్ సింహ్ చిన్న ప్రైవేటు ఉద్యోగి. హిమానికి పుట్టుకతో కంటి సమస్య లేదు. ఇంటర్ వరకు అందరి అమ్మాయిల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగింది. తన చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని ట్యూషన్లు కూడా చెప్పేది. 2011లో ఓ రోజు సైకిల్ పై వెళుతుండగా ఓ బైక్ ఢీ కొట్టింది. కిందపడిన హిమానీ లేచి నిలబడింది. చేతికి, కాలికి చిన్న దెబ్బలు తగిలి రక్తం వస్తోంది.  చిన్నదెబ్బలేగా... అవి కాలంతో పాటూ మానిపోతాయని భావించింది. ఈ యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తరువాత కంటి సైట్ నెంబర్ అమాంతం పెరిగింది. ఏం జరిగిందో తెలియక వైద్యుడి దగ్గరికి వెళ్లింది. 


యాక్సిడెంట్ జరిగినప్పుడు కనిపించని దెబ్బ కళ్లకు పడింది. కంటిపైన ఉండే రెటీనా కంటి నుంచి డిటాచ్ అయినట్టు చెప్పారు వైద్యులు. ఆపరేషన్ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. కేవలం ఎనిమిది నెలల కాలంలో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మొదట మూడు ఆపరేషన్లు జరిగినంత కాలం చూపు బాగానే ఉంది. ఏమైందో తెలియదు నాలుగో ఆపరేషన్ జరిగాక కంటి చూపు పూర్తిగా పోయింది హిమానికి. ఇప్పుడు కేవలం వెలుగు, చీకట్లను మాత్రమే గుర్తించగలదు. 


ఈ ఘటన జరిగాక దాదాపు ఆరునెలలు తీవ్రమైన మానసిక వ్యధలో కూరుకుపోయింది హిమానీ. నవ్వడమే మర్చిపోయింది. తరువాత తనకు తానే ధైర్యం చెప్పుకుని మరల ట్యూషన్లు మొదలుపెట్టింది. ఇంతకుముందు పుస్తకం చూసి పాఠాలు చెప్పేది, కంటి చూపు పోయాక పిల్లలనే పాఠం చదవమని, తరువాత తాను విడమరచి చెప్పేది. లెక్కల్లో హిమానీ మంచి నేర్పరి. తిరిగి తన జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. 


చదువు కొనసాగించేందుకు కాలేజీలకు దరఖాస్తు చేసింది కానీ అంధురాలిని తీసుకునేందుకు ఏ కళాశాల ముందుకు రాలేదు. చివరికి లక్నోలోని ‘డాక్టర్‌ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ’లో సీటు రావడంతో అక్కడ చేరింది. ఆ యూనివర్సిటీ అంధులను వేరుగా చూడరు, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సాధారణ విద్యార్థులతో కలిపే పాఠాలు చెబుతారు. బీఎడ్ పూర్తి చేసి కేంద్రీయ విద్యాలయలో టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది హిమానీ. అది కూడా లెక్కల టీచర్ గా. చూపు లేకపోయినా బోర్డుపై లెక్కలు చేసి వివరిస్తుంది ఆమె. అందుకు విద్యార్థుల సాయాన్ని తీసుకుంటుంది. 


కేబీసీలో పాల్గొనాలన్న తన కోరికను 13వ సీజన్ లో నెరవేర్చుకంది హిమానీ. కోటి రూపాయలు గెలుచుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ డబ్బుతో తనలాంటి దివ్యాంగులను ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తానని చెప్పింది. 


Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?


Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం


Also read:బాలీవుడ్ స్టార్ హీరోకు మాతృవియోగం... ఎమోషనల్ పోస్టు