పలు ప్రకటనల్లో డ్రగ్స్‌కు దూరంగా ఉండండి అని చెప్పే దగ్గుబాటి రానా.. ఈ డర్టీ కేసులో చిక్కుకోవడం సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో జరిగిన సిట్ విచారణలో కూడా రానా పేరు బయటకు రాలేదు. మరి ఈడీ విచారణలో రానాను ఎందుకు విచారిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రానాకు కెల్విన్‌తో పరిచయం ఎలా ఏర్పడింది? అతడితో జరిగిన లావాదేవీలు తదితర విషయాలపై ఈడీ బుధవారం విచారణ జరపనుంది. ఈ సందర్భంగా రానా ఈడీ కార్యాలయానికి హాజరయ్యాడు.
డ్రగ్స్ కేసుకి సంబంధించి మంగళవారం కెల్విన్, కుదూస్‌లను ఈడీ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో 30 మందికి పైగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో కీలకంగా కెల్విన్, వహీద్, ఖుద్దూస్, జీషాన్‌లను గతంలోనే విచారించి వారి బ్యాంక్ ఖాతాలను ఈడీ పరిశీలించింది. విదేశాలకు భారీగా డబ్బు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సెలబ్రిటీల బ్యాంక్ ఖాతాల నుంచి కెల్విన్, ఖుధూస్, వహీద్, జీషాన్ అకౌంట్లకు నగదు బదిలీ జరిగినట్లు తేలింది. మంగళవారం నటుడు నందును విచారిస్తున్న సమయంలోనే ఈడీ అధికారులు కెల్విన్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రానా విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెల్విన్ ఇచ్చే సమాచారం ఆధారంగానే రానాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈడీ చేతిలో కెల్విన్ కాల్ డేటా ఉంది. గురువారం రవితేజను ఈడీ విచారించనుంది. ఈ కేసుతో రానాకు సంబంధం ఉందా లేదా అనేది ఈడీ విచారణ తర్వాతే తేలనుంది.
2016లో హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో నటుడు నవదీప్ పార్టనర్‌గా ప్రారంభించిన ‘ఎఫ్-క్లబ్’ చూట్టూ ఈ డర్టీ పిక్చర్ కథ నడుస్తోంది. ఆ రోజు నవదీప్ ఆహ్వానం మేరకు ఆ క్లబ్‌లో పార్టీకి హాజరైన తారలే ఎక్సైజ్ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. తాజాగా ఈడీ విచారణకు సైతం హాజరువుతున్నారు. ఆ పార్టీలో డ్రగ్స్ అక్రమ సరఫరా నిందితుడు కాల్విన్ మస్కరేన్హాస్ సినీ ప్రముఖులను కలిశాడని తెలిసింది. అతడి వద్ద కొందరు డ్రగ్స్ కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) 12 మంది సినీ ప్రముఖులను విచారించింది. ఆ క్లబ్ ద్వారా భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అనుమానం. ఈ నేపథ్యంలో అధికారులు క్లబ్‌ను సీల్ చేశారు. విచారణలో భాగంగా ఎఫ్ క్లబ్‌లోని సీసీటీవీ కెమేరా వీడియోలను కూడా పరిశీలిస్తున్నారు.
వీరిలో పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ తదితరులు ఉన్నారు. విచారణలో భాగంగా అధికారులు వారి గోళ్లు, రక్తం, వెంట్రుకలు తదితర శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ కేసు విచారణ సుమారు రెండేళ్లు సాగింది. అయితే, ఈ విచారణకు హజరైన సినీ ప్రముఖుల పేర్లు చార్జిషీట్‌లో నమోదు చేయలేదు. పైగా ఈ డ్రగ్స్ కేసును ఎదుర్కొంటున్న 62 మంది బాధితులని పేర్కొనడంతో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ చట్టం కింద మరోసారి డ్రగ్స్ కేసును విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఈడీ 12 మందికి నోటీసులు పంపింది. అయితే అప్పట్లో సిట్ విచారణలో లేని రకుల్ ప్రీత్, రాణాలను ఈసారి ఈడీ విచారిస్తోంది. గతేడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైంది. ఆమెతోపాటు బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది.
Also Read: మత్తులో మాణిక్యాలు.. ఎఫ్-క్లబ్ చుట్టూ తిరుగుతున్న డ్రగ్స్ కథ, ఆ పార్టీయే కొంప ముంచిందా?
కెల్విన్ అప్రూవర్‌గా మారడంతో ఈడీ పని సులభమైంది. గతంలో ఎక్సైజ్ శాఖ కూడా కెల్విన్‌ను విచారించింది. కానీ, అప్పట్లో ఏ వివరాలు కెల్విన్ చెప్పలేదు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఆధారంగా ఈడీ ఆరు నెలల కిందట కెల్విన్ మీద కేసు నమోదు చేసింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈడీ అతడిని 12 సార్లు ప్రశ్నించారు. అతడి అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో అప్రూవర్‌గా మారాడు. ఈ సందర్భంగా ఈడీకి పలు కీలక వివరాలను అందించాడు. వాటి ఆధారంగానే ఈడీ తాజాగా 12 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కొనుగోలులో భాగంగా విదేశాలకు భారీగా నగదు బదిలీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల అకౌంట్లను ఈడీ పరిశీలిస్తోంది.