బిట్ కాయిన్... ఇదొక క్రిప్టోకరెన్సీ. కాయిన్ అనగానే మన రూపాయి నాణాల్లా ఉంటాయనుకోవద్దు. ఇదొక వర్చువల్ కరెన్సీ. కంటికి కనిపించదు. కంప్యూటర్ కోడ్ ల రూపంలో ఉంటుంది. దీని ద్వారా చెల్లింపు జరపడం లేదా ఎవరికైనా ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి కూడా కంప్యూటర్ కోడ్ ల ద్వారానే జరుగుతాయి. 


బిట్ కాయిన్ ను ఇప్పటివరకు ఏ దేశం కూడా అధికారికంగా గుర్తించలేదు. కారణం దాని అస్థిరతే. కాగా తొలిసారి ఓ దేశం బిట్ కాయిన్ను తమ అధికారిక కరెన్సీగా గుర్తించి రికార్డు సృష్టించింది. సెంట్రల్ అమెరికాలో ఓ చిన్న దేశం ఎల్ సాల్వడార్. అమెరికన్ డాలర్ ఇప్పటివరకు దీని అధికారిక కరెన్సీగా ఉంది. ఇప్పుడు బిట్ కాయిన్ కు కూడా అధికారిక కరెన్సీ హోదాను ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు నయిబ్ బుకెలే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ ప్రకటనకు ముందే ఆ దేశ ప్రభుత్వం 400 బిట్ కాయిన్లను కొనుగోలు చేసినట్టు చెప్పారు నయిబ్. వీటి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. ఇకపై ఆ దేశ ప్రజలు బిట్ కాయిన్ రూపంలో కూడా చెల్లింపులు చేయవచ్చు. తాము చరిత్ర సృష్టించామని, భవిష్యత్తులో ప్రపంచం దృష్టి ఎల్ సాల్వడార్ పైనే ఉంటుందని దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు నయిబ్. అయితే ఆ దేశంలో 70 శాతం మందికి అసలు బ్యాంకు ఖాతాలే లేకపోవడం గమనార్హం. 


బిట్ కాయిన్ ఏ దేశానికి చెందినది కాదు. ఏ దేశ సెంట్రల్ బ్యాంకు వ్యవస్థ దీన్ని నియంత్రించలేదు. బిట్ కాయిన్ల సృష్టి చాలా కష్టతరమైనది. దీన్ని మైనింగ్ అంటారు. బిట్ కాయిన్లను సృష్టించేవారిని మైనర్లు అంటారు. ప్రపంచంలో సగానికి పైగా మైనర్లు చైనా నుంచే పనిచేస్తున్నారు. బిట్ కాయిన్ విలువ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ మన దేశ కరెన్సీలో ముప్పై నాలుగు లక్షల రూపాయలకు పైమాటే ఉంది. 


మొదటిసారి బిట్ కాయిన్ వ్యవస్థ మొదలైంది 2009 జనవరిలో. దీని సృష్టికర్తగా సతోషి నకమోటో పేరు చెబుతారు. బిట్ కాయిన్లను ఎన్ని పడితే అన్ని సృష్టించలేరు. ఎప్పటికైనా సరే బిట్ కాయిన్ సంఖ్య 2.1 కోట్లకు మించకుండా నియంత్రించారు. ప్రస్తుతం 1.24 కోట్ల బిట్ కాయిన్ల మైనింగ్ జరిగింది.  


Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?


Also read: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...


Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్