కేరళకు చెందిన ఓ జ్యూయలరీ బ్రాండ్ భీమా తమ ప్రకటనలో ఓ ట్రాన్స్ జెండర్ జీవితాన్ని చూపించి కొత్తదనానికి తెరతీసింది. ఒక నిముషం నలభై సెకనుల పాటూ సాగే ఈ ప్రకటన నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘ప్యూర్ ఏస్ లవ్’(Pure as Love)అని ఈ ప్రకటనకు పేరు పెట్టారు భీమా వారు. ఇన్ స్టాలో పద్నాలుగు లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోగా, యూట్యూబ్లో తొమ్మిదిలక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇరవైఒక్కేళ్ల ట్రాన్స్ జెండర్ మీరా సింఘానియా రెహాని ఇందులో నటించారు. ఈమె ప్రస్తుతం ఢిల్లీలో సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.
ఈ ప్రకటనలో అమ్మాయిగా మారాలనుకుంటున్న అబ్బాయికి అతని కుటుంబం అండగా నిలుస్తుంది. ఒకసారి బంగారు కాలి పట్టీలు, మరోసారి బంగారు గాజులు... ఇలా ప్రతి దశలో ఒక్కొక్క నగను కానుకగా ఇస్తుంటారు. చివరికి పూర్తిగా అమ్మాయిగా మారాక మెడనిండా బంగారు హారాలతో పెళ్లికూతురిగా ఆమెను ముస్తాబు చేసి తల్లితండ్రి స్వయంగా ఇంటి నుంచి పెళ్లి మండపానికి తీసుకెళ్తుండడంతో ప్రకటన ముగుస్తుంది. ఈ ప్రకటన నెటిజన్లకు సరికొత్త ఫీలింగ్ ను అందించింది. దీంతో లక్షల్లో వీక్షణలతో పాటూ, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఇందులో నటించిన ట్రాన్స్ జెండర్ మీరా జీవితం మాత్రం ప్రకటనలో చూపించినంత పూల దారి కాదు. సొంత తండ్రి నుంచే ఆమె ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రెండేళ్ల క్రితమే ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. తొలిగా తల్లికే తాను అబ్బాయిని కాదని, తన మనసు పొరల్లో ఓ అమ్మాయి దాగుందంటూ విషయాన్ని బయటపెట్టింది. ఇంట్లో కేవలం తన సోదరి నుంచి మాత్రమే ఆమెకు మద్దతు లభించింది.
ప్రస్తుతం మీరా ఓ పక్క చదువుతూనే, సంపాదన కోసం మోడల్ గా మారింది. కానీ భీమా యాడ్లో అమ్మాయిగా మారిన అబ్బాయిగా కనిపించేందుకు మొదట్లో ఇష్టపడలేదు. ‘నా జీవితాన్ని అందరికీ చూపించాల్సి అవసరం లేదనిపించింది. కానీ ఆ కాన్సెప్ట్ నాకు నచ్చింది. కుటుంబ సభ్యుల మద్దతు దొరికితే ట్రాన్స్ జెండర్లెవరూ నాలాగా ఇంట్లోంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆ యాడ్ చేశా’ అని చెప్పుకొచ్చింది మీరా.
Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి
Also read: రొయ్యల నిల్వ పచ్చడి ఇలా చేసి చూడండి... అదిరిపోతుంది