వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలుసు. అదే వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి వేసుకుని తిని చూడండి... ప్లేటు ఖాళీ చేయడం ఖాయం. తయారుచేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. నిజం చెప్పాలంటే రొయ్యల కూర కన్నా రొయ్యల పచ్చడం చేయడమే సులభం. 


కావాల్సిన పదార్థాలు: 


పచ్చి రొయ్యలు - కిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - పది టేబుల్ స్పూన్లు (కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
కారం - 200 గ్రాములు
పసుపు - ఒక టేబుల్ స్పూను
గరం మసాలా - ఒక టేబుల్ స్పూను
కరివేపాకు - గుప్పెడు ఆకులు
మెంతులు పొడి - ఒక టేబుల్ స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - పావు లీటరు
వెల్లుల్లి రెబ్బలు - పది (పొట్టు తీసినవి) 
నిమ్మకాయలు - రెండు



తయారీ విధానం 


1. ముందుగా పచ్చి రొయ్యలను బాగా కడిగి, శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నీరు లేకుండా చూసుకోవాలి.  
2. స్టవ్ పై కళాయి పెట్టి  నూనె వేయాలి. నూనె వేడెక్కాక శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించాలి. రొయ్యలోంచి నీరు ఊరుతుంది. ఆ నీరంతా ఇంకిపోయేదాకా వేయించాలి. ఇప్పుడు పసుపు వేసి కలపాలి. 
3. రొయ్యలు బాగా వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.  కళాయిలో మిగిలిన నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, మెంతి పొడి, ఉప్పు వేసి వేయించాలి. 
4. ఆ మిశ్రమం వేగాక ముందుగా వేయించిపెట్టుకున్న రొయ్యలను కూడా వేసి కలపాలి. 
5. మరొక చిన్న కళాయిలో కాస్త నూనె వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించి, రొయ్యల మిశ్రమంలో కలపాలి. 
6. చల్లారాక  రెండు నిమ్మకాయల రసాన్ని పిండి బాగా కలపాలి. అంతే టేస్టీ రొయ్యల పచ్చడి సిద్ధమైనట్టే. 


దీన్ని తడిలేని సీసాలో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. కొన్ని నెలల పాటూ ఇది చెక్కు చెదరకుండా ఉంటుంది. నిమ్మరసం త్వరగా పచ్చడిని పాడవ్వనివ్వదు.  మీకు మరింత స్పైసీగా కావాలనుకుంటే వండేటప్పుడు మరికొంచెం కారం, గరం మసాలా వేసుకోవచ్చు. 


పోషకాలు...
సముద్రఆహార ఉత్పతుల్లో బలవర్ధక మైనవి రొయ్యలే. వీటిలో ఉండే సెలీనియం క్యాన్సర్ నిరోధకతను కలిగి ఉంటుంది. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును తొలగిస్తాయి. గుండెకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మ సౌందర్యానికి సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి12 జ్ఞాపకశక్తి పెంచుతుంది, మతిమరుపు వ్యాధి దరిచేరకుండా చూస్తుంది. 


Also read:ముఖంపై ముడతలు పోవాలా... పసుపుతో ప్రయత్నించండి
Also read:నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?
Also read:కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి