మారుతున్న వాతావరణం, ఆధునిక జీవన శైలి ముప్పై ఏళ్లు దాటకముందే చర్మాన్నిమసకబారేలా చేస్తుంది. ముడతలు, మచ్చలు, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఇలా ఎన్నో సమస్యలు యువతపై దాడి చేస్తున్నాయి. వీటి కోసం ఎన్నో ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుగా ఉన్నాయి. వాటి కోసం వందలు, వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వంటింట్లో మనకు దొరికే పసుపుతోనే చాలా చర్మ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ. దీన్ని తేనె, గంధం పొడి, పెరుగు వంటి వాటితో కలిపి చర్మంపై మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లోనే ప్యాక్ లు తయారుచేసుకుని ముఖానికి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
1. చెంచాడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి, కొన్ని పాలు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుంటే అరగంట పాటూ వదిలేయాలి. తరువాత గోరు వెచ్చటివ నీళ్లతో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి.
2. ఆరుబయట తిరగడం వల్ల ముఖానికి ట్యాన్ పట్టడం సర్వసాధారణం. దీని కోసం రసాయనాలు కలిగిన ట్యాన్ రిమూవర్ ను వాడాల్సిన అవసరం లేదు. పసుపు సహజసిద్ధంగా ట్యాన్ రిమూవర్ లా పనిచేస్తుంది. పసుపు, గులాబీ పొడి, పెసర పిండి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి బాగా మర్ధనా చేయాలి. రోజూ రాత్రిళ్లు ఇలా చేసుకుని, కడిగేసుకుని నిద్రపోవాలి.
3. పసుపు, బొప్పాయి గుజ్జు కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి, మెడకు మాస్క్ లా వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. తరచూ ఇలా చేస్తుంటే ముడతలు కనుమరుగవుతాయి. అంతేకాదు చర్మం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అందం ఇనుమడిస్తుంది.
4. చాలా మందికి మోచేతులు దగ్గర చర్మం డార్క్ గా మారిపోతుంది. ఈ డార్క్ ప్యాచెస్ ను పసుపుతో పొగొట్టుకోవచ్చు. పసుపు, శెనగపిండి, నిమ్మరసం కలిపి ఆ ప్రదేశంలో మర్ధనా చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే నలుపుదనం క్రమంగా తగ్గుతుంది.
గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్
Also read: కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి
Also read: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?