‘నెలసరి సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దు. దీని వల్ల అధికంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది’ ఇదే ఎక్కువ మంది మహిళలకు చేరిన అబద్ధపు ప్రచారం. నిజానికి కరోనా వ్యాక్సిన్ కు, నెలసరికి సంబంధమే లేదు. రెండూ తమ శరీరంలోని తమ విధులను చేసుకుంటూ పోతాయి. ఒకదాని చర్యలపై మరొకటి చూపే ప్రభావం ఏమీ ఉండదు. 


సాధారణంగా నెలసరి సమయంలో కొందరు మహిళలకు హార్మోన్ల మార్పుల వలన విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కో నెలసరిలో రక్తస్రావం కూడా అధికంగా కావచ్చు. అలాగే వ్యాక్సిన్ తీసుకుంటే తేలికపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంగా ఉండడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే మహిళలు నెలసరి సమయంలో ఈ వ్యాక్సిన్ తీసుకోవడంలో పీరియడ్స్ వల్ల కలిగే సమస్యలకు, వ్యాక్సిన్ వల్ల కలిగే ఇబ్బందులు తోడై కాస్త కష్టంగా అనిపించవచ్చు. ఆ కష్టం పడకూడదు అనుకుంటే నెలసరి సమయంలో వ్యాక్సిన్ కు దూరంగా ఉండండి. అంతేకానీ వ్యాక్సిన్ వల్ల నెలసరిలో ఎలాంటి మార్పులు జరగవు. 


చాలా మంది మహిళలు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? నెలసరికి ముందా లేక పూర్తయ్యాక  అని వైద్యులును ప్రశ్నిస్తున్నారు. వైద్యులు చెప్పినదాని ప్రకారం ఎప్పుడూ తీసుకున్నా ఒక్కటే. నెలసరికి ముందు ఒకలా, నెలసరి తరువాత ఒకలా వ్యాక్సిన్ ప్రవర్తించదు. శరీరంలోకి చేరాక దాని కర్తవ్యం అది నిర్వహిస్తుంది. అలాగే పీసీఓడీ, పీసీఓఎస్ వంటి ఆరోగ్య సమస్యలు కలిగిన వారు కూడా నిరభ్యంతరంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 


ఇక పిల్లల కోసం ప్రయత్నిస్తున్న మహిళలు మాత్రం రెండు డోసులు పూర్తయ్యాక ప్రయత్నిస్తే మంచిది. రెండు డోసులు తీసుకున్న ఎనిమిది వారాల తరువాత శరీరంలో యాంటీ బాడీల ఉత్పత్తి మొదలవుతుంది. ఆ తరువాత పిల్లల కోసం ప్రయత్నిస్తే ఆ యాంటీ బాడీలు ఏర్పడబోయే పిండానికి రక్షణ కవచంలా నిలుస్తాయి. ఈ విషయాన్ని మీరు ఓసారి వైద్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.  


కోవిడ్ టీకా మహిళల నెలసరులపై కానీ, సంతానోత్పత్తిపై కానీ ఎలాంటి ప్రభావం చూపించదు. 


గమనిక: పలు అధ్యయనాల, సమాచారం ఆధారంగా మీ అవగాహన కోసం ఈ కథనం అందించాం. వైద్యనిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు సలహా తీసుకోవాలి.


Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం


Also read: నెలసరి సక్రమంగా లేదా? పీసీఓఎస్ కారణం కావచ్చు...


Also read: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...