మనదేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు పీసీఓఎస్ సమస్య బారిన పడుతున్నట్టు ఆరోగ్య అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి సరిగా అవగాహన  లేకపోవడంతో సమస్య బాగా ముదిరాక వైద్యులను సంప్రదిస్తున్నవారు ఉన్నారు. దీనివల్ల చికిత్స చేసినా పెద్దగా ఫలితాలు పొందడం లేదు. 2021 సెప్టెంబరు నెలను ‘పీసీఓఎస్ అవగాహన నెల’గా ప్రకటించారు. ఈ సందర్భంగా పీసీఓఎస్ సమస్య ఎందుకు వస్తుంది? చికిత్స ఏంటి? దీని వల్ల కలిగే దుప్ష్రభావాలేంటో తెలుసుకుందాం. 


ఏంటీ సమస్య?
కొందరిలో నెలసరి సక్రమంగా రాదు. రెండు మూడు నెలలకోసారి రావడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది.పెళ్లయినవాళ్లయితే మొదట ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకోవాలి. ఆ టెస్టు నెగిటివ్ ఫలితాన్ని ఇస్తే, వైద్యుడిని సంప్రదించి నెలసరులు ఎందుకు సక్రమంగా రావట్లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్ళి కాని ఆడపిల్లలు నెలసరులు మిస్సయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒక్కోసారి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. ఇది కూడా పీసీఓఎస్ లక్షణాల్లో ఒకటి.


వైద్యుడు అల్ట్రాసౌండ్, రక్త పరీక్షల ద్వారా సమస్యను గుర్తించే ప్రయత్నం చేస్తాడు. ఇది కేవలం పెద్దల్లో వచ్చే సమస్య మాత్రమే కాదు, రజస్వల అయినా పదకొండు, పన్నేండేళ్ల ఆడపిల్లల్లో కూడా కలుగుతుంది. 


పీసీఓఎస్ ను సకాలంలో గుర్తించకపోయినా, దీర్ఘకాలంగా మందులు వాడకుండా ఉన్నా సమస్య చాలా ప్రమాదకరంగా మారుతుంది. క్యాన్సర్స్, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశమున్నట్టు వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది. ముఖంపై మొటిమలు, జుట్టు  పెరగడం ప్రారంభమవుతాయి. బరువు కూడా పెరుగుతారు. జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 


ఎందుకు వస్తుంది?
శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు చ‌క్కెర స్థాయి పెరుగుతుంది. ఈ క్రమంలో పురుష హార్మోను అయినా ఆండ్రోజ‌న్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా పీసీఓఎస్ సమస్య వచ్చే ప్ర‌మాదం ఉంటుంది. అండాశ‌యాల్లో నీటి తిత్తులు ఏర్ప‌డి అండాల విడుద‌ల‌ను అడ్డుకోవడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పిల్లలు కలిగే అవకాశం సన్నగిల్లుతుంది.


ఈ సమస్యను పూర్తిగా నివారించే చికిత్స అందుబాటులో లేదు. కాకపోతే తీవ్రతను తగ్గించి సాధారణ జీవితానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవచ్చు. దీనికి క్రమం తప్పకుండా మందులు వాడాల్సి రావచ్చు. 


గమనిక : ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.


Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్
Also read:ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి
Also read: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?