వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నాలుగు రోజుల కిందట సింహాచలం ఆలయానికి వెళ్లారు. ఆయనకు అక్కడి అధికారులు ముఖ్యమంత్రి స్థాయిలో అధికార లాంఛనాలతో స్వాగతం పలికి మర్యాదలు చేశారు. ఈ విషయంలో మీడియాలో ప్రముఖంగా రావడంతో వివాదాస్పమయింది. ఆ ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు వెళ్తే అక్కడి అధికారులు పట్టించుకోలేదు. అప్పుడే అశోక్ గజపతిరాజు - విజయసాయిరెడ్డి హోదాలను పోల్చి ఆలయ అధికారులపై విమర్శలు కూడా చేశారు. ఆదివారం రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి బాధ్యత మొత్తం తన మీదనే ఉన్నట్లుగా ఆయన వైజాగ్ ఎయిర్‌పోర్టును రక్షణశాఖకు ఇచ్చేస్తామని ప్రకటించారు. విశాఖ - విజయనగరం జిల్లాలను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన ప్రకటనలు సామాన్యులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. అసలు విజయసాయిరెడ్డి  హోదా ఏంటి.? ఆయన అధికారం ఎంత ఉంది..? అనే ప్రశ్నలు రావడమే ఆ విస్మయానికి కారణం.


ఉత్తరాంధ్రతో అధికారికంగా ఎలాంటి పదవీ బాధ్యతలు లేని ఎంపీ విజయసాయిరెడ్డి ! 


విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ. ఆయన విశాఖ పట్నం నంచి ఎంపీగా గెలవలేదు. అంతే కాదు ఆయన స్వస్థలం కూడా విశాఖ కాదు. అంటే అధికారికంగా విశాఖ తో కానీ ఉత్తరాంధ్రతో కానీ విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్నారు. అంటే ఆ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యత వారి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నమాట. ఆయన పార్టీ వ్యవహారాలను మాత్రమే చూసుకోవాలి. కానీ అధికార పార్టీకి ఉత్తారంధ్ర ఇంచార్జ్ అంటే.. మొత్తం అధికారికంగా కూడా తానే ఇంచార్జ్ అన్నట్లుగా విజయసాయిరెడ్డి అధికారాలను ధఖలు పర్చుకుని పరిపాలన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఇవి విమర్శలు మాత్రమే కాదు కళ్ల ముందే ఆయన నేరుగా పరిపాలన చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. విశాఖలో కబ్జాలపై వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం తరపున రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయనెవరు అనేది మౌలికంగా వచ్చే ప్రశ్న. అలాంటివి కోకొల్లలుగా విజయసాయిరెడ్డి విషయంలో ఉన్నాయి.


Also Read : విశాఖలో వంద కోట్ల భూమిపై ఎమ్మెల్యే కుమారుడి కన్ను !


ఉత్తరాంధ్రను ఒంటి చేత్తో పరిపాలిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటనలు..! 


ఉత్తరాంధ్ర గురించి విజయసాయిరెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే మూడు జిల్లాల నుంచి ఉన్నతాధికారులు తరలి వస్తారు. ఒక్కో సారి అధికారికంగా సమావేశం నిర్వహిస్తారు. దానికి ఇంకేదో పేరు పెడతారు. మరెవరో అధ్యక్షత వహిస్తారు. కానీ మొత్తం అక్కడ ఏ టూ జడ్ షో విజయసాయిరెడ్డిదే. అక్కడిక్కడ ఆదేశాలు జారీ చేస్తారు. మీడియాతోనూ నిర్ణయాలను స్వయంగా ప్రకటిస్తారు. ఇతర సీనియర్ ప్రజాప్రతినిధులు, మంత్రులు అంతా సైలెంట్‌గానే ఉంటారు. ఉత్తరాంధ్రకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒకరు పాముల పుష్పశ్రీవాణి, మరొకరు ధర్మాన కృష్ణదాస్. అలాగే బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేత కూడా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు. అయితే ఎవరూ ఎంపీ విజయసాయిరెడ్డి స్థాయిలో అధికారులపై కమాండింగ్ పొజిషన్‌లో లేరు. వారి మాట వినే అధికారులు కూడా తక్కువేనన్న గుసగుసలు ఉన్నాయి.


Also Read: పంజరం నుంచి సీబీఐకి విముక్తి ఎప్పుడు ?


రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విపక్షాల విమర్శలు..! 


ఉత్తరాంధ్రలో కీలక నియామకాలు అంటే పోలీస్ కమిషనర్ దగ్గర్నుంచి ఆర్డీవో వరకూ ప్రతీ నియామకం విజయసాయిరెడ్డికి తెలిసే జరుగుతుందని .. ఆయన ఆశీస్సులు ఉంటే మాత్రమే పోస్టింగ్‌లు వస్తాయనేది బహిరంగ రహస్యం. అలా నియమితులైన అధికారులు ఆయన మాటల్నే శిరసావహిస్తున్నారు. ఈ కారణంగానే ఇతర మంత్రులు.. ప్రజాప్రతినిధుల కన్నా  విజయసాయిరెడ్డికే ఎక్కువ పలుకుబడి లభిస్తోందని అంటున్నారు. అందుకే ఉత్తరాంధ్ర డిఫ్యాక్టో సీఎంగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో పాలనా యంత్రాగంపై పట్టు సాధించి ..తన పరిపాలనా నిర్ణయాల గురించి మీడియాతో కూడా నిర్మోహమాటంగా చెప్పే విజయసాయిరెడ్డి కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నారన్న అభిప్రాయం సామాన్య జనంలో ఏర్పడుతోంది.
 


Also Read : మోసం కేసులోవిశాఖ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్