కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో కొట్టేద్దామనుకున్న కేటుగాళ్ల వ్యూహాన్ని పత్రికా ప్రకటన బట్టబయలు చేసింది. విశాఖ నగరంలో కోట్లు విలువ చేసే భూమిని అడ్డదారిలో అమ్మడానికి కుట్రపన్నారు. రిజిస్ట్రేషన్‌ వరకూ వెళ్లిన వ్యవహారం పత్రికా ప్రకటనతో నిలిచిపోయింది. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులను విచారణకు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు విషయాలను సోమవారం విశాఖ సీపీ కార్యాలయంలో సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.


తప్పుడు పత్రాలతో 


అమెరికాలో ఉంటున్న తుమ్మల కృష్ణచౌదరికి విశాఖ కొమ్మాదిలో 12.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మేందుకు విశాఖకు చెందిన జరజాపు శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వి.జయసూర్యలను ప్రయత్నించారు. వీరద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణచౌదరి భార్య లక్ష్మీసూర్య ప్రసన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల ఒకటో తేదీన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి ఆనందరాజ్‌ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఇంటర్‌పోల్‌ సాయంతో అతన్ని అరెస్టు చేస్తామని సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. కృష్ణచౌదరిలా కొనుగోలుదారులతో మాట్లాడి మోసం చేసేందుకు ప్రయత్నించినందుకు అతనిపై వారెంట్‌ జారీ చేశామన్నారు. 


ఎమ్మెల్యే కుమారుడికి అమ్మేందుకు


శ్రీనివాసరావుకు తుమ్మల కృష్ణచౌదరితో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొమ్మాదిలో ఉన్న 12.26 ఎకరాల భూమి అత్యంత విలువైనది కావడంతో ఎలాగైనా విక్రయించి డబ్బు సంపాదించాలనుకున్నాడు శ్రీనివాసరావు. ఈ విషయాన్ని జయసూర్యకు చెప్పి విశాఖ జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు, కశ్యప్‌ డెవలపర్స్‌కు చెందిన సుకుమార్‌వర్మకు ఈ భూమిని అమ్మేందుకు ప్లాన్ చేశాడు. న్యూయార్క్‌లో ఉన్న ఆనందరాజ్‌తో కృష్ణచౌదరిలా మాట్లాడించారు. అనంతరం అడ్వాన్స్‌గా రూ. కోటి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు మాత్రం జాప్యం చేశారు. రిజిస్ట్రేషన్‌ చేయాలని సుకుమార్‌వర్మ డిమాండ్‌ చేయగా సంతకాలు, ఇతర పత్రాలు ఫోర్జరీ చేసి తమ పేరున తప్పుడు జీపీఏ సృష్టించారు. రిజిస్ట్రేషన్‌ చేయించే ముందు పత్రికా ప్రకటన ఇస్తే మంచిదని భావించిన ఎమ్మెల్యే కుటుంబం పత్రికలో ప్రకటన ఇచ్చారు. 


Also Read: Public Servent Cases : రాజకీయ నేతల అవినీతికి రక్షణ ? "పబ్లిక్ సర్వెంట్‌" కేసులపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు అందుకేనా..?


నకిలీ జీపీఏతో


ఈ ప్రకటన కృష్ణచౌదరి భార్య లక్ష్మీ సూర్యప్రసన్న దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే స్పందించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ జీపీఏ ద్వారా డాక్యుమెంటు సృష్టించి రిజిస్ట్రేషన్‌ను చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఆ భూమిని రూ.18.75 కోట్లకు ఎమ్మెల్యే కుటుంబీకులకు అమ్మేందుకు ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్ గా రూ.5 కోట్లు వరకు ఇచ్చారు. ఫోర్జరీ పత్రాలతో ప్రజల ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ఘటనలు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ కోరారు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. 


 


Also Read: Viral Video: ఇసుక అక్రమ రవాణా వ్యవహారం... మంత్రి ఫోన్ సంభాషణ వైరల్!