తెల్ల బియ్యంతో వండే అన్నం తింటే త్వరగా అరిగిపోయి, తిరిగి ఆకలివేస్తుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కూడా పెంచుతుంది. అందుకే బరువు తగ్గాలని భావించేవారికి, షుగర్ తో బాధపడే వారికి తెల్ల అన్నాన్ని తగ్గించమని సలహా ఇస్తారు వైద్యులు. అన్నం తినడం అలవాటైన వారు, తినకుండా ఉండడానికి చాలా కష్టపడతారు. అలాంటి వారికి మంచి ఆప్షన్ ఎర్రబియ్యం. దీన్ని తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే అధికంగా గ్లూకోజ్ రక్తంలో విడుదల కాదు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువ కావని ఇప్పటికే ఓ పరిశోధన తేల్చింది. ఈ  బియ్యం కిలో ధర రూ.120 దాకా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారు. 


ఎర్ర బియ్యానికి పట్టణ ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఆరోగ్య కారణాల రీత్యా ఎర్ర అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారు. బ్రౌన్ రైస్ తో పోలిస్తే దీని రుచి కూడా బావుంటుంది. వీటిలో లావు బియ్యం, సన్న బియ్యం రెండు రకాలు ఉన్నాయి కనుక బిర్యానీ వంటివి కూడా వండుకోవచ్చు. ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా తినడం ప్రారంభించేస్తారు. ఒక కప్పు ఎర్ర అన్నం తింటే 216 కెలోరీలు లభిస్తాయి. 


1. ఎర్ర బియ్యానికి ఆ రంగు యాంతోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల వస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. ఈ అన్నాన్ని తింటే త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. తద్వారా బరువు తగ్గే అవకాశం ఎక్కువ.
2. ఇది రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ఐరన్ అందుతుంది. ఆక్సిజన్ సమస్థాయిలో శరీరానికి చేరి అలసట త్వరగా కలుగదు. 
3. ఇందులో ఉండే విటమిన్ బి6 ఎర్రరక్తకణాల సంఖ్య పెరిగేందుకు సహకరిస్తుంది. 
4.ఈ ఎర్రబియ్యంలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. దీనివల్ల కీళ్ల సమస్యలు, మోకాలి నొప్పులు తగ్గుతాయి. 
5. కంటిచూపును మెరుగు పడడం, క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడం, రక్తపోటును తగ్గించడం వంటి మంచి గుణాలు ఎర్రబియ్యంలో ఉన్నాయి. 
6. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా దీనికి ఎక్కువ. 


Also read: తొలిసారి ఓ దేశ అధికారిక కరెన్సీగా బిట్ కాయిన్


Also read: నిజమేనా.... మిలిటరీ డైట్ తో వారంలో బరువు తగ్గొచ్చా?


Also read:మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?